Friday, July 18, 2025

పల్లెల్లో విడిసిల విధ్వంసం

- Advertisement -
- Advertisement -

ఈ మధ్యకాలంలో తెలంగాణ పల్లెల్లో గ్రామాభివృద్ధి కమిటీల పేరున విధ్వంసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న సందర్భాన్ని మనం ప్రసార మాధ్యమాల ద్వారా, పత్రికల ద్వారా గమనిస్తున్నాం. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఈ ఆగడాలు మరి ఎక్కువగా సాగుతున్నాయని చెప్పడానికి అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలలో గత కొన్ని నెలల కిందట నుండి విడిసిలపైన నమోదైన కేసులనే నిదర్శనంగా చెప్పవచ్చు. తెలంగాణ ప్రాంతంలో ఏపల్లెల్లో చూసినా రాజ్యాంగబద్ధ సంస్థలైన గ్రామపంచాయతీ వ్యవస్థ కన్నా, విడిసిలే బలమైన శక్తిగా పనిచేస్తున్నాయని మనందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో తెలంగాణ పల్లెల్లో జరుగుతున్న విడిసిల విధ్వంసాలను చూసి ఉన్నత విద్యావంతులైన మేధావి వర్గం, సామాజిక ఉద్యమకారులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారని చెప్పకతప్పదు.

విడిసిలు ఏమైనా రాజ్యాంగబద్ధ సంస్థలా అనే చర్చ తెలంగాణ పల్లెల్లో జోరుగా సాగుతోంది. రాజ్యాంగబద్ధ సంస్థలు కాకున్నా రాజ్యాంగబద్ధ సంస్థ (constitutional body) ఆయన గ్రామపంచాయతీ, సర్పంచ్ వ్యవస్థకన్నా బలీయమైన శక్తిగా పనిచేస్తూ రాజ్యాంగేతర, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని చెప్పడానికి ఉదాహరణలు కోకొల్లలు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం భారత రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా, ఆర్టికల్ 40 ఆధారంగా ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 243 ప్రకారం గ్రామపంచాయతీకి 29 విధులను నిర్వర్తించాలని సూచించడం జరిగింది. ఇది సమర్థవంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పని చేయడానికి, ప్రజలచేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్స్, కార్యనిర్వాహక అధికారి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ నియమాలకు అనుకూలంగా పనిచేస్తారు. గ్రామాలలో ఏర్పాటు చేసుకున్న గ్రామ అభివృద్ధి కమిటీలలో అధిక శాతం అక్షరాస్యులకన్నా నిరక్షరాస్యులే ఎక్కువగా ఉంటున్నారని గమనించవచ్చు.

అనేక గ్రామాలలో ఈ గ్రామాభివృద్ధి కమిటీలు, కులవివాదాలకు, సామాజిక అంతరాలకు కారణమవుతున్నాయని, అదేవిధంగా ఈ గ్రామాభివృద్ధి కమిటీలలో కూడా సామాజికంగా ఎదిగినవారే ఎక్కువగా చలాయిస్తూ, నిమ్నవర్గాల వారి ప్రాతినిధ్యాన్ని తొక్కిపెడుతూ, వారిని నామమాత్రపు ప్రతినిధులుగా భాగస్వామ్యం చేస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు. తెలంగాణలో ఏమారుమూల గ్రామాన్ని తట్టి చూసినా, ప్రతి పల్లెల్లో అక్రమంగా వెలిసిన బెల్ట్ షాపులే దర్శనమిస్తాయి. ఈ బెల్ట్‌షాపులను గ్రామాభివృద్ధి కమిటీలు వేలంపాట ద్వారా ఎవరైతే ఎక్కువ వేలం పాడుతారో వారికి కట్టబెట్టి ప్రభుత్వానికి రావలసిన లక్షల, కోట్ల ఆదాయానికి గండి కొడుతున్నారని చెప్పవచ్చు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రాంతాలలో కాకుండా ప్రతిగ్రామంలో అక్రమ బెల్ట్ షాపులు తెరవడం వలన గ్రామంలోని యువత ఎక్కువగా మద్యానికి బానిసై వారి భావిజీవితాలను నాశనం చేసుకుంటున్నారని చెప్పడంలో సందేహం లేదు.

వీటికితోడు గ్రామాలలో కల్లుబట్టీలను, శీతల పానీయాలను కూడా వేలం వేసి లక్షల రూపాయలను సమకూర్చుకుంటున్నారని, ఇలాంటి అక్రమ వ్యాపారాల వలన గ్రామాలలోని నిమ్నవర్గాలకు సంబంధించిన ప్రజలు తాగుడికి బానిసై వారి జీవితాలను బుగ్గి చేసుకుంటున్నారని మనం అనేక కథనాలను విన్నాం. గ్రామాలలో ఏర్పడిన చిన్నచిన్న వివాదాలను పరిష్కరించి పబ్బం గడుపుకోవడం గ్రామాభివృద్ధి కమిటీలకు నిత్యకృత్యమే. భూతగాదాలకు సంబంధించిన పంచాయతీలు, కులవివాదాలకు సంబంధించిన పంచాయతీలు, భార్యాభర్తలు వివాదాలకు సంబంధించిన పంచాయతీలు, ఇతర చిల్లరమల్లర వివాదాలను పరిష్కరించి జరిమానాలు విధించడం వాటితో జల్సాలకు పాల్పడడం విడిసిలకు పరిపాటిగా మారింది. పంచాయతీల విషయంలోగానీ, కులవివాదాల విషయం లోగాని మరి ఏఇతర అంశాల విషయంలోగానీ, చట్టాన్ని, న్యాయాన్ని పాటించకుండా తీర్పులు ఇవ్వడం ముదావహం.

ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీల మాట వింటేనే సరి, లేదంటే వారికి కుల బహిష్కరణనో సాంఘిక బహిష్కరణనో విధించడం విడిసిలకు వెన్నతోపెట్టిన విద్య. ఇలాంటి సంఘటనల వల్ల అనేక గ్రామాలలో నిమ్నకులాలవారు మనోవేదనకు గురై, ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా మనం ఎన్నో చూశాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటైన పంచాయతీ వ్యవస్థను పక్కనపెట్టి తెలంగాణ పల్లెల్లో గ్రామాభివృద్ధి కమిటీలే రాజ్యాంగేతరశక్తిగా క్రియాశీలకపాత్ర పోషించడం, నేటి ఈ ఆధునిక కాలంలో సరైనది కాదని, కావున ఇప్పటికైనా తెలంగాణ పల్లెల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ విధ్వంసాన్ని స్పృష్టిస్తున్న గ్రామాభివృద్ధి కమిటీల వ్యవస్థను రద్దుచేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేనియెడల ఉన్నత న్యాయస్థానాలే ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి గ్రామాభివృద్ధి కమిటీ వ్యవస్థను రూపుమాపేలా చేసి చట్టాలను, రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాలని ప్రజాస్వామికవాదులు ఆకాంక్షిస్తున్నారు.

  • దర్శనం దేవేందర్, 99896 51768
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News