ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ప్రజలు వినే పరిస్థితి నుండి చీదరించుకునే స్థాయికి దిగజారిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికలప్పుడు సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని హామీ ఇచ్చి చేతకాక తీరా సంవత్సరంన్నర తరవాత సోమవారం జరిగిన సభలో రాబోయే రెండున్నర సంవత్సరాలలో లక్ష ఉద్యోగాలు ఇస్తా అంటూ మాట మార్చడం నిరుద్యోగులను మోసం చేయడం కాదా..? అని ఒక ప్రకటనలో ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో కెసిఆర్ ఉద్యోగ నోటిఫికేషన్‌లు ఇచ్చి, రాత పరీక్షలు పెట్టి, ఎంపిక పూర్తి చేసిన తర్వాత వారికి నియామక పత్రాలు మాత్రమే ఇచ్చి.. 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి చెప్పిన అబద్దాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పడం అబద్దాలకోరుతనం కాదా..? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ కట్టిన ప్రాజెక్ట్‌లే నల్లగొండ బీళ్లు తడుపుతున్నాయి అన్న రేవంత్ రెడ్డి, గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎస్‌ఆర్‌ఎస్‌పి నుండి తుంగతుర్తి చివరి ఆయకట్టు వరకు ఎందుకు నీళ్లు రాలేదని అడిగారు.
గత కెసిఆర్ 10 ఏండ్ల కాలంలోనే తుంగతుర్తిలో చివరి ఆయకట్టు రైతులు ఎందుకు పంటలు పండించగలుగారని అన్నారు. గత కెసిఆర్ ప్రభుత్వ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అంటున్న రేవంత్ రెడ్డి.. గత 10 ఏండ్లలో 6 లక్షల పైగా కొత్త రేషన్ కార్డు లు ఇచ్చామని తెలిపారు. ఈ అంశంపై చర్చకు సిద్ధమా..? అంటూ సవాల్ విసిరారు. 4 పంటల వరికి 500 బోనస్ ఎక్కడ వేశారని నిలదీశారు. రుణమాఫీ కూడా అసంపూర్తిగా చేశారని, రైతు భరోసా రెండు సార్లు ఎగ్గొట్టి స్థానిక ఎన్నికలు ఉంటాయని ఇటీవల ఒకసారి ఇచ్చారని ఆరోపించారు. రైతుకు బాకీపడ్డ మిగతా రైతు భరోసా డబ్బులు కూడా ఇచ్చి మాట్లాడాలని అనారు. రేవంత్‌రెడ్డి పాలనలో రైతు వ్యవసాయం పండగ అయితే 18 నెలల కాలంలో 700 పైగా రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరిగాయని ప్రశ్నించారు. ప్రతి గింజ కొన్నాము అంటున్న రేవంత్ రెడ్డి కల్లాల మీద వడ్లు కొనక పిట్టల్లా రాలిన రైతులను మరిచారా..? అని నిలదీశారు. రాష్ట్రంలో ఏ గ్రామనికైనా పోదాం…కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీల్లో ఏవి సంక్రమంగా అమలు అవుతున్నయో ప్రజల మధ్యనే చర్చకు సిద్ధమా..?
అంటూ సిఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. కాళేశ్వరం కూలేశ్వరం కాదు ..మీ మైండ్‌లు కుళ్లినాయి అందుకే ప్రాజెక్ట్‌పై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం లిఫ్ట్‌లు ప్రారంభించి నీళ్లు లిఫ్ట్ చేస్తే కెసిఆర్‌కు ఎక్కడ పేరు వస్తుందో అని పనిగట్టుకొని ప్రాజెక్ట్‌పై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వర్షాభావ పరిస్థితులు ఉన్న ఇలాంటి సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ వినియోగంలోకి తేకుండా రైతుల పంటలను ఎండబెడుతున్నారని మండిపడ్డారు. తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చర్చకు సిద్ధం అని సోమజిగూడ ప్రెస్‌క్లబ్‌కి వస్తే రాత్రికి రాత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి పారిపోయారని, ఆయనకు ఛాలెంజ్ లు అవసరమా..? అని ఎద్దేవా చేశారు. వచ్చిన తెలంగాణను గత 10 ఏండ్ల కెసిఆర్ పాలనలో దేశంలో అగ్రగామిగా చేస్తే రేవంత్‌రెడ్డికి పాలన చేతకాక రాష్ట్రాన్ని తిరోగమనం దిశగా తీసుకెళ్తున్నారని ఆరోపించారు. ప్రజలకు అన్ని అర్థమవుతున్నాయని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి ఊకదంపుడు ఉపన్యాసాలకు కాలం చెల్లిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ప్రజలు ఆయనకు చరమగీతం పాడుతారని జోస్యం చెప్పారు.