Tuesday, August 12, 2025

కోమటిరెడ్డి కోతల రెడ్డిగా మారాడు: వేముల ప్రశాంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మెదడుకు నాలుకకు కనెక్షన్ కట్ అయ్యి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ వేముల ప్రశాంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత రెండు సంవత్సరాలలో ఆర్ అండ్ బి మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొత్తగా ఒక గుంత పూడిచింది లేదు, ఒక్క ఇటుక పెర్చింది లేదని విమర్శించారు. ఉట్టి మాటలు పిచ్చి వాగుడు తప్పిస్తే వెంకట్‌రెడ్డికి విషయంపై అవగాహన లేదని, కోమటిరెడ్డి కోతల రెడ్డిగా మారాడని విమర్శించారు. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విలేఖరులతో ఇష్టాగోష్ఠిలో చేసిన వ్యాఖ్యలపై వేముల ప్రశాంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. దుబాయ్ పోయి బోటులో షికార్లు చేయడం, ఎస్‌ఎల్‌బిసి పేరు మీద అమెరికా పోయి పార్టీలు చేసుకోవడం తప్ప వెంకటరెడ్డి ఈ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమి లేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్‌ఎల్‌బిసి కోమటిరెడ్డి తెలివి తక్కువ తనం వల్లే కూలిందని, ఇప్పటికీ చనిపోయిన వారి శవాలు కూడా బయటకు తీయలేని అసమర్థుడు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

ఉప్పల్ – నారపల్లి ఫ్లై ఓవర్ పని కేంద్రం పరిధిలోని అనే జ్ఞానం కూడా వెంకట్ రెడ్డికి లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా ఇప్పటికీ ఉప్పల్ ఫ్లై ఓవర్ పని పూర్తి కాలేదని ప్రశ్నించారు. రీజనల్ రింగ్ రోడ్డు పనులు ఇంకా మొదలు కాలేదని అన్నారు. ఉత్తర భాగం రీజనల్ రింగ్ రోడ్డు ఆర్‌ఆర్‌ఆర్ పనులకు సంవత్సరం క్రితం టెండర్లు పిలిచారని, నెల రోజుల్లోనే పనులు మొదలవుతాయని ఆయనే స్వయంగా అన్నారని, అయినా ఇప్పటికీ పనులు మొదలు కాలేదని, దీనికి వెంకట్‌రెడ్డి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. దక్షిణ భాగం ఆర్‌ఆర్‌ఆర్ విషయంలోనైతే ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని చెప్పారు. ఈ విషయాలు అసెంబ్లీ సాక్షిగా ఇదివరకే తాను చెప్పానని, వెంకట్‌రెడ్డి మరిచిపోతే రికార్డులు తెప్పించి చూసుకోవాలని సూచించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం చేత కాకపోతే,మంత్రి పదవి నుండి తప్పుకోవాలని అన్నారు. ఇంకోసారి కెసిఆర్ మీద ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే నల్గొండ ప్రజలే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పిచ్చాసుపత్రికి పంపిస్తారని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News