సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ ఫిల్మ్ మేకర్ వెంకటేష్ మహా కొత్త చిత్రం రావు బహదూర్‌ను గర్వంగా సమర్పిస్తున్నారు. ఇందులో వర్సటైల్ హీరో సత్య దేవ్ (Satya Dev) ప్రధాన పాత్రలో నటించారు. కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు పొందిన వెంకటేష్ మహా ఇప్పుడు తెలుగు సినిమా బౌండరీలు దాటే ఒక ఆసక్తికరమైన సైకాలజిక్ డ్రామాలోకి అడుగుపెడుతున్నారు. పరిశ్రమలోని అత్యంత విజయవంతమైన రెండు బ్యానర్‌లు ఎ+ఎస్ మూవీస్ , శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్న రావు బహదూర్ ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తోంది. టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
సోమవారం దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ’నాట్ ఈవెన్ ఎ టీజర్’ లాంచ్ చేశారు. జమీందారీ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఓ పాత కోటలో ఒంటరిగా జీవిస్తున్న హీరోని పరిచయం చేస్తారు. తనకి అనుమానం అనే భూతం పట్టుకుందని నమ్ముతాడు. ఆ అనుమాన భూతమే తన జీవితాన్ని మార్చేస్తుంది. నిజం, భ్రమ మధ్య గీతే కనిపించకుండా చేస్తుంది. అతని గతంలో ఒక రహస్యమైన ప్రేమకథ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో సాగే నాట్ ఈవెన్ ఎ టీజర్‌తో సినిమాపై ఆసక్తి రెట్టింపు అయింది. హీరో సత్యదేవ్ అద్భుతమైన నటన కనబరిచాడు. యవ్వనం నుంచి వృద్ధాప్యం వరకు వేర్వేరు లుక్స్‌లో, వేర్వేరు భావాలతో పాత్రను అద్భుతంగా పోషించాడు. రావు బహదూర్ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల సబ్ టైటిల్స్‌తో 2026 సమ్మర్‌లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.