Monday, July 14, 2025

కోట కన్నుమూత

- Advertisement -
- Advertisement -

తీవ్ర అనారోగ్యం.. వృద్ధాప్య సమస్యలతో తెల్లవారుజామున తుదిశ్వాస
750కి పైగా సినిమాల్లో నటించిన శ్రీనివాసరావు విలక్షణ నటుడిగా
గుర్తింపు తొమ్మిదిసార్లు నంది పురస్కారాలతో గౌరవం 2015లో
పద్మశ్రీతో సత్కరించిన భారత ప్రభుత్వం ప్రధాని మోడీ, సిఎం రేవంత్,
మాజీ సిఎం కెసిఆర్ సహా ప్రముఖుల సంతాపం ఎపి సిఎం చంద్రబాబు,
సినీరంగ ప్రముఖుల నివాళి పలువురి కంటతడి

తన తిరుగులేని నటనా పటిమతో, అద్భుతమైన హావభావాలతో దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన కోట శ్రీనివాసరావు (83) ఇక లేరు. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో ఉన్న తన ఇంట్లో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన పరిస్థితి విషమించి మృతిచెందారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో 750కు పైగా సినిమాల్లో ఎన్నో విలక్షణ పాత్రల్లో కోట శ్రీనివాస రావు నటించారు. విలనిజమైనా.. హాస్య పాత్రలైనా.. క్యారెక్టర్ పాత్ర అయినా.. ఆయన పాత్రలోకి ఒదిగిపోయేవారు. ఇక 1942 సంవత్సరం జులై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో కోటా శ్రీనివాసరావు జన్మించారు. 1968 సంవత్సరంలో రుక్మిణిని వివాహం చేసుకున్న ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కోట శ్రీనివాస రావు కుమారుడు కోట ప్రసాద్ 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.ఇక సినిమాల్లో రాక ముందు కోట శ్రీనివాసరావు స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేశారు. 1978లో ప్రాణం ఖరీదు మూవీతో సినీ రంగంలోకి అరంగ్రేటం చేశారు.

తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఆయన విలక్షణమైన పాత్రలను ఎన్నింటినో పోషించారు. తన నటనతో పాత్రలకు ప్రాణం పోసిన ఆయన తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. 1999— 2004 వరకు విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఆయన.. అనంతరం రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. సుదీర్ఘ సినీ జీవితంలో ఆయన నటించిన చివరి సినిమా సువర్ణ సుందరి. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం సినిమాల్లోనూ ఆయన నటించారు. ఆయన సినీ జీవితంలో అహనా పెళ్లంట, ప్రతిఘటన, యుముడికి మొగుడు, ఖైదీ నెం.786, శివ, బొబ్బిలిరాజా, యమలీల, సంతోషం, బొమ్మరిలు, అతడు, రేసుగుర్రం.. మరచిపోలేని చిత్రాలుగా నిలిచిపోయాయి.ఉత్తమ విలన్, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టు, ఉత్తమ హాస్య నటుడు… ఇలా మొత్తంగా 9 సార్లు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది పురస్కారాలు అందుకున్నారు. అంతేగాకుండా ఆయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను 2015లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డును సైతం అందుకున్నారు.

ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో కోట శ్రీనివాసరావు పార్థివదేహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఏపి సిఎం చంద్రబాబు నాయుడు, ఏపి డిప్యూటీ సిఎం పవన్‌కళ్యాణ్, దేశ మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సినీ ప్రముఖులు చిరంజీవి, వెంకటేష్, రాజమౌళి, అల్లు అరవింద్, శేఖర్ కమ్ముల, బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి తదితరులు కోట శ్రీనివాసరావు మృతదేహానికి పూలతో నివాళులర్పించారు. ఇక సినీ ప్రముఖులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు ముగిశాయి. ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర జరిగింది. అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో మనవడు శ్రీనివాస్ అంతిమ సంస్కారాలు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News