Wednesday, July 23, 2025

రాజీనామా చేశారా.. చేయించారా?

- Advertisement -
- Advertisement -

మరో రెండేళ్ల పదవీకాలం ఉండగానే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పదవికి అనూహ్యంగా రాజీనామా చేయడం రాజకీయంగా సంచలనం కలిగిస్తున్నది. జగదీప్ ఆకస్మిక రాజీనామా వెనుక బలమైన కారణాలు, తీవ్రమైన రాజకీయ ఒత్తిడులు ఉన్నాయని సర్వత్రా భావిస్తున్నారు. ఆయన చెబుతున్నట్లు ఆరోగ్య కారణాలు, వైద్యుల సలహాలు అందుకు దారితీసే అవకాశాలు ఉండకపోవచ్చని రాజకీయవర్గాలు బలంగా నమ్ముతున్నాయి. అదేనిజమైతే, అంత అర్ధాంతరంగా రాజీనామా చేసిఉండేవారు కాదని, కనీసం మర్యాదపూర్వకంగా రాజ్యసభలో ప్రకటించి ఉండేవారని భావిస్తున్నారు.

వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందే, సమావేశాలు పూర్తయిన తర్వాతో రాజీనామా చేసి ఉండేవారు గాని, మొదటి రోజు సమావేశాల తర్వాత అటువంటి తీవ్రమైన నిర్ణయం తీసుకొనే పరిస్థితి ఏర్పడేదికాదు.పైగా, ఆయన రాజకీయ ప్రయాణం గమనిస్తున్న వారు అంతతేలికగా పదవుల నుండి వైదొలిగే వ్యక్తి కాదని కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే దురదృష్టం ఏమిటో గానే కాంగ్రెస్ ఎంఎల్‌ఎగా తప్ప ఏ పదవిలో కూడా పూర్తికాలం కొనసాగలేకపోయారు. తొలుత చౌదరి దేవీలాల్ మద్దతుతో 1989లో పార్లమెంట్‌కు ఎన్నికై, వెంటనే కేంద్ర మంత్రి కాగలిగిన పూర్తికాలం మంత్రి పదవిలో లేరు. ఎంపిగా సైతం నాటి పార్లమెంట్ అర్ధాంతరంగా రద్దయింది. అదే పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా సైతం పూర్తిగా ఐదేళ్లు కొనసాగలేకపోయారు. అయితే ఉపరాష్ట్రపతి పదవికోసం గడువుకు ముందే రాజీనామా చేశారు అనుకోండి.

ఉపరాష్ట్రపతిగా ఓ విధంగా ప్రతిపక్షం నుండి అభిశంస తీర్మానం ఎదుర్కొన్న ఏకైక నేతగా అప్రదిష్ఠకు గురయ్యారు. అయితే ఇప్పుడు ఓ న్యాయమూర్తిపై ప్రతిపక్షం ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని స్వీకరించిన అనంతరం ఉప రాష్ట్రపతిగా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఏదిఏమైనా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదేశంపైననే ఆయన రాజీనామా చేసి ఉండవచ్చని సర్వత్రా భావిస్తున్నారు. కనీసం ఆ పదవికి గౌరవం ఇవ్వడం కోసమైనా వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందే రాజీనామా చేయించి ఉంటే హుందాగా ఉండెడిది. గవర్నర్‌గా ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ముచ్చెమటలు పోయించడం ద్వారా, ఓ బలమైన ప్రతిపక్ష నాయకుడి పాత్ర వహించడం ద్వారా ప్రధాని ప్రశంసలు అందుకొని, ఉపరాష్ట్రపతి హోదా పొందగలిగిన ఆయన ఇప్పుడు ప్రధాని ఆగ్రహం కారణంగా ఆ పదవి కోల్పోవలసి రావడం గమనార్హం. 2022లో, రాజ్యసభ ఛైర్మన్‌గా ఆయన పదవీకాలం వివాదంతో ప్రారంభమైంది. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు 2015లో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ‘ప్రజల నియమావళి’ సంరక్షకుడిగా ఉన్న పార్లమెంటు ‘ఈ సమస్యను పరిష్కరించడానికి’ బాధ్యత వహిస్తుందని స్పష్టం చేశారు.

న్యాయవ్యవస్థతో ఘర్షణతో సహా రాజ్యాంగ సంస్థల పనితీరులో ప్రభుత్వ జోక్యంపై ప్రతిపక్షాలు సభలో చర్చకోరాలని యోచిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేయడంతో వారికి బలం చేకూర్చినట్లయింది. అప్పటి నుండి తరచుగా వివాదాస్పద వాఖ్యలు చేస్తున్నారు. కొద్ది నెలల క్రితం మూడు నెలలు లోగా గవర్నర్లు, రాష్ట్రపతి అసెంబ్లీలు పంపే బిల్లులపై తమ నిర్ణయం ప్రకటించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపట్ల కూడా అసహనంగా మాట్లాడారు. అదేవిధంగా ఓ రైతు బిడ్డగా రైతుల నిరసనలకు నైతిక మద్దతు తెలుపుతూ వాటిని వ్యవసాయ మంత్రి పరిశీలింపలేరా? అంటూ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టడం సైతం ఆగ్రహంకు కారణం కావచ్చు. సోమవారం జరిగిన ఘటనల కారణంగానే వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజు సాయంత్రం ఆయనతో రాజీనామా చేయించి ఉండవచ్చనే అభిప్రాయం బలపడుతుంది. ఆ రోజున జస్టిస్ యశ్వంత్ వర్మ పై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అభిశంస తీర్మానాన్ని స్వీకరిస్తున్నట్లు ప్రకటించి ప్రభుత్వాన్ని నివ్వెరపరిచారు.

ఈ విషయమై లోక్‌సభలో ప్రభుత్వం ‘ఏకాభిప్రాయం’ పేరుతో ఓ నిర్ణయం తీసుకోకుండా దాటవేస్తూ వేస్తుండగా, ఇక్కడ అధికార పక్ష ఎంపిలు ఎవ్వరూ సంతకం చేయకుండా ఆమోదించడం ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడవేసిన్నట్లయింది. పైగా, సభానాయకుడు జెపి నడ్డా సోమవారం రాజ్యసభలో మాట్లాడుతూ ప్రతిపక్ష సభ్యులు మాటలే మాటలు రికార్డులలో నమోదు కావని, తన మాటలు మాత్రమే నమోదు అవుతాయని అంటూ మాట్లాడి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశారు. ఓ విధంగా చైర్మన్ హోదాను సవాల్ చేసినట్లుగా పలువురు భావిస్తున్నారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి యాదవ్‌పై ప్రతిపక్షాలు ఆరు నెలల క్రితమే ఇచ్చిన నోటీసును పట్టించుకోకుండా తాజాగా జస్టిస్ వర్మపై ఇచ్చిన నోటీసును వెంటనే ఆమోదించడం ద్వారా ప్రభుత్వాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టిన్నట్లయింది. ఒక విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలు విధాలుగా ఎదుర్కొంటున్న రాజకీయ సంక్షోభాలను ఈ రాజీనామా ప్రతిబింబింపచేస్తున్నది.

జస్టిస్ వర్మ ఇంట్లో నోట్లు పట్టుబడినా ఎఫ్‌ఐఆర్ సైతం దాఖలు చేయలేదని నాలుగైదు సార్లు ప్రశ్నించడం ద్వారా నేరుగా హోంమంత్రి అమిత్ షాను నిలదీసిన్నట్లయింది. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ప్రతిపక్షాల నుండి తరచూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం ఇవ్వడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ మధ్య కాలంలో ప్రతిపక్ష నాయకులతో సంబంధాలను మెరుగుపరచుకోవడమే కాకుండా, వ్యక్తిగత సంభాషణలలో ప్రధాని మోడీ ధోరణుల పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అందుకనే ఆయన రాజీనామా పట్ల ప్రతిపక్ష నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగబద్ధ పదవులకు ఈ మధ్య కాలంలో చెప్పుకోదగిన గౌరవం లభించడం లేదనే విమర్శలు చెలరేగుతున్నాయి.

ప్రధాన మంత్రి కార్యాలయం నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే గాని రాష్ట్రపతిని కలిసే అవకాశం ఎవ్వరికీ లభించడం లేదని జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇదివరలో ఆరోపణలు చేశారు. రాష్ట్రపతి దృష్టికి కొన్ని అంశాలను తీసుకువెళ్లే ప్రయత్నం చేసి విఫలమైనట్లు చెప్పారు. ఏదేమైనా ఓ అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని అంత అర్ధాంతరంగా రాజీనామా చేసేవిధంగా చేయడం మెరుగైన ప్రజాస్వామ్య సంప్రదాయం అని చెప్పలేం. కనీసం ఆయనకు సభలో ఓ ప్రకటన చేసి, సభ్యుల నుండి గౌరవపూర్వకంగా వీడ్కోలు తీసుకునే అవకాశం కూడా ఇవ్వకపోవడం అవమానకరంగా పంపించడమే అవుతుంది. రాజీనామా చేసే ముందు జరిగిన రాజ్యసభ బిఎసి సమావేశంకు సభానాయకుడు జెపి నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు హాజరు కాకుండా, కనీసం ముందుగా చైర్మన్‌కు సమాచారం ఇవ్వకుండా గైరాజరు కావడం సైతం అవమానించడమే కాగలదు. సాధారణంగా పార్లమెంట్, అసెంబ్లీలు సజావుగా సమావేశాలు జరుపకుండా ప్రతిపక్షాలు అడ్డుకలిగిస్తూ ఉంటాయి.

కానీ పార్లమెంట్ విషయంలో అధికార పార్టీ సభ్యులే సభాకార్యక్రమాలకు తరచూ ఆటంకం కలిగిస్తూ ఉండటం అధ్యక్ష వహించేవారికి సైతం చికాకు కలిగిస్తుంది. జగదీప్ ధన్‌ఖడ్ వంటి వారు అటువంటి ధోరణుల పట్ల అసహనం వ్యక్తం చేస్తూ ఉండే అవకాశం ఉంది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, వీటిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు అంటి అంశాలపై చర్చలకు ప్రభుత్వం సిద్ధమే అంటూ వాటిని చర్చకు చేపట్టమని ప్రతిపక్ష సభ్యులు అడుగుతూ ఉంటే అంగీకరించకుండా, సమావేశాలు జరపకుండా చేయడం ప్రభుత్వ వైఖరిని అద్దం పడుతుంది. అందుకనే గత కొన్నేళ్లుగా పార్లమెంట్ సమావేశాలు చాలా తక్కువ రోజులు జరుగుతున్నాయి. ప్రతిరోజూ అల్లర్లతో గడిచిపోవడం, చివరిలో ఎటువంటి చర్చలేకుండా కీలక బిల్లులను ఆమోదింప చేసుకోవడం ఓ రివాజుగా మారింది. రాబోయే కాలంలో మోడీ ప్రభుత్వం ఎదుర్కొనే సవాళ్ళకు ఈ రాజీనామా రాజకీయంగా ఆజ్యం పోసే అవకాశం ఉంది.

చలసాని నరేంద్ర
98495 69050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News