హైదరాబద్: విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటిస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్’. భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో హీరోయిన్. ఈ సినిమా టీజర్ వచ్చి చాలాకాలమే అయింది. టీజర్‌తో చిత్రంపై అంచనాలు పెంచేశారు చిత్ర బృందం. ఆ తర్వాత సినిమా నుంచి ఓ పాటను విడుదల చేశారు. ఆ తర్వాత సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. అంతేకాక.. సినిమా విడుదల తేదీ ఇప్పటికే రెండు, మూడు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. దీంతో విజయ్ (Vijay Deverakonda) ఫ్యాన్స్ సినిమా ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురుచూస్తూ ఉన్నారు. ఎట్టకేలకు ఆ ఎదురు చూపులకు బ్రేక్ పడింది.
ఈ చిత్రం రిలీజ్‌డేట్ టీజర్‌ని చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. సినిమాలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ టీజర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చివరిగా సినిమాను జూలై 31వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. జెర్సీ సినిమా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో నటుడు సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.