ఢిల్లీ: ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండగా నిలుస్తుందని విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ తెలిపారు. ఏప్రిల్ 22న పహల్గామ్ లో భారత పర్యటకులపై ఉగ్రదాడి జరిగిందని, ఈ దాడిలో 26 మంది కన్నుమూశారని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ పై భారత విదేశాంగ శాఖ, రక్షణ శాఖ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ఉగ్రదాడి వెనుక లాష్కరే తోయిబా కుట్ర ఉందని మండిపడ్డారు. లాష్కరే తోయిబా అనుబంధ సంస్థ టిఆర్ఎఫ్ ఈ దాడి చేసిందని విక్రమ్ స్పష్టం చేశారు. దాడి చేశామని సోషల్ మీడియాలో టిఆర్ఎఫ్ ప్రకటించిందన్నారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండగా నిలువడంతో ఆ దేశంపై దౌత్య, వాణిజ్య పరమైన ఆంక్షలు విధించామన్నారు. చాలా కాలం నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్ లో అభివృద్ధిని అడ్డుకునేందుకే ఉగ్రదాడి జరిగిందని, కశ్మీర్ ఆర్థికాభివృద్ధిని అడ్డుకునేందుకు తీవ్రవాదులు దాడి చేశారని మిస్త్రీ పేర్కొన్నారు.
నియంత్రణ రేఖ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముజఫరాబాద్ లోని ఎల్ఇటి క్యాంపుపై తొలి దాడి చేశామని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. ఎల్ఒసిలోని బింబల్ క్యాంపులో దాడి చేశామని, ఇక్కడే లాష్కరే తోయిబా ఉగ్రవాదులకు ట్రైనింగ్ దుయ్యబట్టారు. పాకిస్తాన్ లోని సర్జల్ క్యాంపుపై దాడి చేశామని, సర్జల్ క్యాంప్ ఎల్ఒసికి 8 కిలోమీటర్ల దూరంలో ఉందని, ముర్కిదే క్యాంపుపై దాడి చేశామని, ఇక్కడ నుంచి ముంబై పేలుళ్లకు ప్లాన్ చేశారని, కసబ్ ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నారని రక్షణ శాఖ అధికారులు వివరించారు. జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. సరిహద్దులో భద్రతపై ఒబర్ అబ్దుల్లాతో అమిత్ షా చర్చించారు. ప్రజల కోసం అన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పహల్గమ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత వాయు సైన్యం బాంబులతో దాడి చేయడంతో వంద మంది తీవ్రవాదులు హతమైనట్టు సమాచారం.