తెలంగాణ ప్రభుత్వం నేతన్నలకు శుభవార్త తెలిపింది. చేనేత కార్మికులకు సంబంధించిన రూ.33 కోట్ల చేనేత రుణాలను మాఫీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ జీఓ నెంబర్ 106 పేరుతో ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య (టెక్స్‌టైల్) శాఖ 2025- 26 బడ్జెట్‌లో భాగంగా చేనేత కార్మికులకు ఋణ మాఫీ చేసేందుకు రూ.33 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతి ఇచ్చింది.
ఈ నిధులు చేనేత కార్మికులకు రుణమాఫీ పథకం కింద విడుదల చేస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు హ్యాండ్లూమ్స్, అప్పారెల్ ఎక్స్‌పోర్ట్ పారక్స్ కమిషనర్‌కు ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి మధ్య తీసుకున్న చేనేత రుణాలు మాఫీ కానున్నాయి. రూ.లక్ష లోపు రుణాలు మంజూరు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఋణమాఫీలు చేసినందుకు నేతన్నలు, చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.