Monday, May 5, 2025

ఖనిజ ఒప్పందం ఎవరికి లాభం?

- Advertisement -
- Advertisement -

ఉక్రెయిన్‌లోని అపారమైన, అరుదైన ఖనిజ సంపదను చేజిక్కించుకోవాలనుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎట్టకేలకు పైచేయి సాధించారు. అపురూప ఖనిజాలపై చైనా ప్రాభవానికి బ్రేకు వేయాలని ట్రంప్ పట్టుదలగా ఉన్నారు. అత్యంత ఆధునిక సాంకేతిక, రక్షణ రంగాలకు అవసరమయ్యే కీలకమైన, అపురూప ఖనిజాల్లో ప్రపంచం మొత్తం మీద 90% వరకు చైనాయే ఉత్పత్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ఖనిజ ఒప్పందంపై గత కొంతకాలంగా ట్రంప్ పట్టుదలగా ఉండడం గమనార్హం. ఖనిజ తవ్వకాలకు ఒప్పందం కుదిరితేనే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని నివారించడానికి, శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నిస్తానని పట్టుబట్టి తన పంతం నెగ్గించుకున్నారు. ఇక ఏం చేయాలో దిక్కుతోచక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తలవంచక తప్పలేదు.

అయితే ఈ ఒప్పందం వల్ల రష్యా యుద్ధం ఆగిపోతుందా? ఖనిజాల తవ్వకాల నుంచి వచ్చిన నిధులు ఉక్రెయిన్ పునరాభివృద్ధికి ఉపయోగపడతాయా? ఆ మేరకు అమెరికా ప్రభుత్వం సహకరిస్తుందా? అన్న ప్రశ్నలకు ఇంకా సరైన సమాధానాలు లభించడం లేదు. ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇరుదేశాలు ప్రస్తుతం గోప్యంగానే ఉంచాయి. ఈ కొత్త ఒప్పందాన్ని ‘యుఎస్ ఉక్రెయిన్ రీఇన్వెస్ట్‌మెంట్ ఫండ్’ అని వ్యవహరిస్తున్నారు. ఖనిజ తవ్వకాలకు ఉక్రెయిన్ వీలు కల్పించినందున దానికి ప్రతిఫలంగా ఉక్రెయిన్ ‘సంయుక్త పునర్నిర్మాణ పెట్టుబడి నిధిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిధికి ఉక్రెయిన్ అమెరికా చెరిసగం నిధులు సమకూర్చవలసి ఉంటుంది. ఈ ఒప్పందంలో ఏడు ముఖ్యమైన అంశాలు ఇమిడి ఉన్నాయి.

ఖనిజ వనరుల కోసం ఉమ్మడిగా అన్వేషణ చేయడం, ఉక్రెయిన్ అభివృద్ధికి పెట్టుబడులు ముమ్మరంగా ప్రవహింప చేయడం, ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పడం, పాత అప్పుల గురించి అడగకపోవడం, రష్యా పట్ల ముఖ్యంగా పుతిన్ పట్ల అమెరికా కఠిన వైఖరిని అవలంబించడం, ఖనిజ వనరుల లబ్ధి అమెరికా పొందినా కానీ యాజమాన్యం మాత్రం ఉక్రెయిన్ కిందే ఉండాలనడం, యూరోపియన్ యూనియన్‌లో చేరాలన్న ఉక్రెయిన్ చిరకాల స్వప్నానికి ఆటంకం కలగకుండా చూడడం అనే సంక్లిష్ట అంశాలు ఉన్నాయి. మరి వీటిలో ఏయే అంశాలకు అమెరికా సహకరిస్తుందో లేక తిరస్కరిస్తుందో చూడాలి.ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ పట్ల కఠిన వైఖరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అవలంబించ గలుగుతారా? అన్నది మీమాంసే.

ఉక్రెయిన్‌కు 350 బిలియన్ డాలర్లు ఇచ్చామని, ఆ సొమ్ము తిరిగి ఇవ్వాలని ట్రంప్ గతంలో డిమాండ్ చేశారు. కొత్త ఒప్పందం ప్రకారం ఆ డబ్బును తిరిగి ఉక్రెయిన్ ఇవ్వాలిన అవసరం లేనట్టు స్పష్టమవుతోంది. ఇప్పుడు ఉక్రెయిన్‌కు తాము ఇప్పటిదాకా ఇచ్చిన దాని కన్నా అధికంగా తిరిగి పొందబోతున్నామని ట్రంప్ చెప్పడం గమనార్హం. ఈ ఒప్పందం వల్ల ఉక్రెయిన్‌కు రష్యా నుంచి కానీ మరే దేశం నుంచి యుద్ధాలు తలెత్తకుండా అమెరికా నుంచి పూర్తి భద్రత లభిస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఎంతో ఆశిస్తున్నారు. కానీ ఇప్పుడు కుదిరిన ఒప్పందంలో భద్రతపై గ్యారంటీ మాత్రం ప్రస్తావించలేదు. మరి భద్రతపై గ్యారంటీ లేని ఈ ఒప్పందాన్ని ఉక్రెయిన్ పార్లమెంట్ ఆమోదిస్తుందా? అన్న అనుమానం కలుగుతోంది. వాస్తవానికి యుద్ధంలో ఉక్రెయిన్‌కు ఎన్నో చిక్కులు వచ్చి పడుతున్నాయి.

ట్రంప్ వచ్చిన తరువాత ఏమాత్రం భరోసా లభించడంలేదు. ఈ పరిస్థితుల్లో అమెరికా మద్దతు లేకుంటే సైనికులకు ప్రమాదం తప్పదు. గట్టి భద్రత ఉక్రెయిన్‌కు కల్పిస్తామన్న గ్యారంటీకి ట్రంప్ ఇష్టపడడం లేదు. పరిమిత ప్రయోజనాలతో ఉక్రెయిన్ చివరకు ఈ ఒప్పందానికి ఒప్పుకోక తప్పలేదు. ప్రపంచం మొత్తం మీద ఉండే ఖనిజాల్లో 5% ఉక్రెయిన్‌లోనే ఉండగా, ఉక్రెయిన్ ఖనిజ లోహాల నిల్వల్లో 40% ప్రస్తుతం రష్యా నియంత్రణలోనే ఉన్నాయి. ఇవన్నీ వినియోగం కాలేదు. ప్రపంచం మొత్తం మీద ఉండే గ్రానైట్‌లో 20% ఉక్రెయిన్‌లోనే ఉంది. అలాగే ప్రపంచం మొత్తం మీద మాంగనీస్ ఉత్పత్తుల్లో ఎనిమిదో స్థానం, టిటానియం ఉత్పత్తిలో 11వ స్థానంలో ఉక్రెయిన్ ఉంది.

అరుదైన ఖనిజాలు ఆరు క్షేత్రాల్లో ఉన్నాయని, నోవో పోల్టావ్ స్కే వద్ద గనుల అభివృద్ధికి 300 మిలియన్ డాలర్లు అవసరమవుతాయని జెలెన్‌స్కీ గతంలో వెల్లడించారు. కీలకమైన ఖనిజాలు వంద కన్నా ఎక్కువ నిల్వలు ఉన్నాయని, టిటానియమ్, లిథియమ్‌తోపాటు 19 మిలియన్ టన్నుల గ్రాఫైట్ నిల్వలు ఉన్నాయని ఉక్రెయిన్ చెబుతోంది. అయితే 350 బిలియన్ డాలర్ల విలువైన గనులు రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగాల్లోనే ఉన్నాయని అంటోంది. కొన్ని సహజ వనరుల సమాచారం ప్రభుత్వ రహస్యంగా ఉంచడం సోవియెట్ తరం నాటి విధానంగా ఉంటోంది. గత ఏడాది సహజ వనరుల నుంచి 1.1 బిలియన్ డాలర్లనే రాయల్టీగా ఉక్రెయిన్ ప్రభుత్వం పొందగలిగింది.

రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగాల్లో ఖనిజాల తవ్వకం చేపట్టాలంటే ముందు ఆయా భూభాగాల పొరల్లో నిక్షిప్తమై ఉన్న మందుపాతరలను చాకచక్యంగా నిర్మూలించవలసి ఉంటుంది. ఈ మేరకు ఖనిజాల అన్వేషణ, సర్వే వంటి వాటికి చాలా వ్యయప్రయాసలు భరించక తప్పదు. అంతమొత్తం ఖర్చు చేయడానికి, రిస్కు తీసుకోవడానికి అమెరికా ఎంతవరకు సిద్ధమవుతుందో తెలీదు. ఇదిలా ఉండగా రష్యా యుద్ధం మరోవంక సుదీర్ఘకాలం కొనసాగుతుంటే ఉక్రెయిన్ గనుల తవ్వకం చేపట్టడం సంక్లిష్టమవుతుంది. ఉక్రెయిన్ పట్టణాలు, నగరాలు, ముఖ్యంగా ముందు వరుసలో ఉన్న ప్రాంతాలు విధ్వంసంలో ఉన్నాయి. వాణిజ్య కార్యకలాపాలు అమెరికా ప్రారంభించే ముందు ఉక్రెయిన్ మౌలిక సౌకర్యాలు చెప్పుకోతగినంతగా పునరుద్ధరణ కావలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News