వందల ఏళ్ల నాటి మసీదులకు సంబంధించిన
దస్తావేజులు ఉంటాయా? 1940వ దశకం నుంచి
అమలులో ఉన్న వక్ఫ్ బై యూజర్ క్లాజ్‌ను తొలగించే
అధికారం మీకు ఉన్నదా? కేంద్ర ప్రభుత్వాన్ని
నిలదీసిన సుప్రీంకోర్టు వక్ఫ్ సవరణ చట్టంపై
న్యూఢిల్లీ : వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు చేపట్టింది. కొత్త చట్టంలోని పలు కీలక నిబంధనల పై అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది.సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించే నిబంధనను ప్రస్తావిస్తూ, హిందూ ఎండోమెంట్ బోర్డులలో ము స్లిం సభ్యులు ఉండేందుకు అనుమతి ఇస్తారా అని ప్రభుత్వాన్ని సుప్రీం ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఆధ్వర్యంలో జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కెవి విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం కొత్త వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ దేశవ్యాప్తంగా దాఖలైన 73 పిటిషన్లను విచారిస్తోంది.
ఈ సందర్భంగా వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు జరగడం ఆందోళన కల్గిస్తోందని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విషయంలో మొదట రెండు అంశాలపై స్పష్టత రావాలని చీఫ్ జస్టిస్ ఖన్నా అన్నారు. మొదటిది సుప్రీంకోర్టు పిటిషన్లను హైకోర్టు కు పంపుతుందా లేదా అన్నది, ఆలాగే చట్టంలో ముఖ్యంగా పిటిషనర్లు ఏ అంశాలపై వాదించాలను కుంటున్నారన్నది తేలాలన్నారు. పిటిషనర్లలో ఒకరి తరుపున హాజరైన సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ మాట్లాడుతూ కొత్త చట్టంలోని అనేక అంశాలు మతపరమైన వ్యవహారాలకు సంబంధించి స్వేచ్ఛను హామీ ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నారు. కొత్త చట్టం అమలులో తలెత్తే వివాదాలను పరిష్కరించే అధికారాలను కలెక్టర్లకు ఇచ్చిన అంశాన్ని ప్రస్తావించారు. కలెక్టర్ ప్రభుత్వంలో భాగంగా పనిచేస్తారని, ఆయనకు జడ్జి పాత్ర పోషించే అధికారాలు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు.
చట్టంలో – వక్ఫ్ బై యూజర్ – అంటే వినియోగదారుని ద్వారా వక్ఫ్ అన్న నిబంధనను ప్రస్తావించారు. అధికార పత్రాలు లేకుండా మతపరమైన ఆస్తిని వక్ఫ్ గా పరిగణించే నిబంధన ఇది. కొత్త చట్టం దీనికి ఓ మినహాయింపు కల్పించిందని. ఇది వివాదంలో ఉన్న లేదా ప్రభుత్వ భూమి, ఆస్తులకు వర్తించదని కపిల్ సిబల్ పేర్కొన్నారు. వినియోగదారుని ద్వారా వక్ఫ్ అన్నది ఇస్లాంలో అంతర్భాగం అని సిబల్ అన్నారు. వక్ఫ్ 3 వేల ఏళ్లక్రితం ఏర్పడిందని, దానికి దస్తావేజులు, రిజిస్ట్రేషన్ పత్రాలు ఉండవని న్యాయవాది సిబల్ పేర్కొన్నారు. మరో పిటిషనర్ తరుపున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి మాట్లాడుతూ దేశంలో 8 లక్షల వక్ఫ్ ఆస్తులలో నాలుగు లక్షల ఆస్తులు వక్ఫ్ బై యూజర్ కు చెందినవేనని అన్నారు. తాము మొత్తం చట్టంపై కాకుండా – వక్ఫ్ బై యూజర్ – తోపాటు కొన్ని నిబంధనలపై స్టే కోరుతున్నామని అభిషేక్ సింఘ్వీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకుని ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమిలో నిర్మించినదని అంటున్నారని, వక్ఫ్ బై యూజర్ – నిబంధన తప్పు అని చెప్పడం లేదని అయితే , ఈ విషయంలో కొంత ఆందోళన ,గందరగోళం ఉందన్నారు.
కేంద్రప్రభుత్వం తరుపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదన వినిపిస్తూ, పార్లమెంటులో విసృ్తత చర్చల తర్వాత ఈ చట్టం ఆమోదం పొందిందని, రెండు సభల సంయుక్త పార్లమెంటరీ కమిటీ విసృ్తతంగా చర్చించి దీనిని రూపొందించిందని, ఉభయసభలు ఆమోదించాయని పేర్కొన్నారు. కొత్త చట్టంలోని -వినియోగదారుల ద్వారా వక్ఫ్ – నిబంధనపై దృష్టి పెట్టాలని ప్రధాన న్యాయమూర్తి సొలిసిటర్ జనరల్ మెహతాను కోరారు. కోర్టు తీర్పు ద్వారా వక్ఫ్ బై యూజర్ నిబంధన సమర్థిస్తే, అది చెల్లదని మీరు వాదించగలరా అని నిలదీశారు. 13,14,15 శతాబ్దాల కాలంలో నిర్మించిన మసీదులకు సంబంధించి పత్రాలు సమర్పించడం అసాధ్యం కాదా అని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. ప్రభుత్వం వక్ఫ్ బై యూజర్ నిబంధనను డీ నోటిఫై చేయబోతున్నట్లయితే , సమస్య తప్పదని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. వక్ఫ్ పేరున కొంత దుర్వినియోగం జరిగినా, నిజమైన వక్ఫ్ కూడా ఉందని ధర్మాసనం పేర్కొంది. కొత్త చట్టంలోని సానుకూల అంశాలను హైలైట్ చేయాలని ప్రధాన న్యాయమూర్తి సూచించారు. కేసు విచారణను రేపటికి వాయిదా వేశారు.
వక్ఫ్ సవరణ చట్టంపై స్టే యోచనలో సుప్రీం
న్యూఢిల్లీ :వక్ఫ్ సవరణ చట్టం పై దాఖలైన పిటిషన్ల విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం చట్టం కొన్ని భాగాలపై మధ్యంతర స్టే ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తోంది. అయితే చట్టంపై కేంద్రం, రాష్ట్రాలకు తమ వాదన పూర్తిగా వినిపించేందుకు మరో 2,3 రోజుల వ్యవధి ఇవ్వాలని చివరి నిముషంలో స్టే ఆలోచనను న్యాయమూర్తులు మానుకున్నారు. ధర్మాసనం చట్టంలోని మూడు కీలక అంశాలను లేవనెత్తింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలనే అభిప్రాయాన్ని న్యాయమూర్తులు సూచించారు. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆధ్వర్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది.