పహల్గాంలో ఉగ్రవాదుల అమానుష హత్యాకాండ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఓ రకమైన ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ఈ రెండు దేశాల మధ్య దౌత్యపరమైన యుద్ధంతో మొదలై రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు వరకు దారితీసింది. పాకిస్తాన్ రాజకీయాల్లో పెరుగుతున్న అస్థిరత మూలంగా అంతర్గత, సీమాంతర ఉగ్రవాదం పెరిగిపోయింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత మన దేశం సోషల్ మీడియా మరింత ఉన్మాదంతో రగిలిపోతుంది. అది కొన్ని రాజకీయ పక్షాల లక్ష్యం అయి వుండవచ్చునేమో? కానీ, అది అత్యంత ప్రమాదకరం! పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి ప్రధాన కారణం రెండు ప్రభుత్వాలు ఆయా మత ఆధిక్య రాజకీయాలు కలిగి ఉండడం. పహల్గాం దాడి ఎలా జరిగింది? ఎవరు చేశారు? వారిని ఎలా శిక్షించాలి? అనే అంశాలు కశ్మీర్ పోలీసు వ్యవస్థ, కేంద్ర బలగాలపై అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం చూసుకుంటుంది. పహల్గాం దాడి తర్వాత బాధితుల ఇంటర్వ్యూలు అనేకం వచ్చాయి.
వాటిలో రెండు పార్శ్వాలు ఉన్నాయి. ఒక మతం వారినే గుర్తించి చంపారనేది ఒక పార్శం అయితే! కశ్మీరీ ముస్లింలు అనేక మంది తమను కాపాడారని చెప్పిన పార్శ్వం రెండవది. ఈ రెండు నిజాలే! ఒకటి మతోన్మాదానికి ప్రతీక అయితే, మరొకటి మత సామరస్యానికి గుర్తు! అయితే అదే సమయంలో పహల్గాంలో ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో హిందువులతో పాటు ముస్లీం పేదలు ఉన్నారు. దీన్ని బట్టి ఉగ్రవాదానికి, దాని చర్యలకు మతం కవచమే కానీ, చర్యలు విషయంలో ఉన్మత్తమే దాని ప్రధాన ఆచరణ అని అర్థం అయింది? ఈ పహల్గాం దాడికంటే ముందు కార్గిల్ యుద్ధం జరిగింది. దీని తర్వాతనే బిజెపి దేశంలో పుంజుకుంది. జమ్మూకశ్మీర్‌లో అయితే ఉగ్రవాదులు, సైన్యం మధ్య దాడులు నిత్యకృత్యం. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన దాడుల్లో బాలాకోట్, పుల్వామా దాడులు దారుణమైనవి. అవన్నీ దేశంలో బిజెపి బలం పుంజుకోవడానికి, ప్రతిపక్షాలు డిఫెన్స్‌లో పడడానికి రాజకీయ ఆయుధాలుగా మారాయి.
గతంలో దాడులు సమయంలో సర్జికల్ స్ట్రైకింగ్‌తో సరిపెట్టు కున్నాం. పహల్గాం దాడి తర్వాత కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకుందాం అనే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా ప్రకటనలు ఉన్నాయి. అందుకనుగుణంగా దౌత్యయుద్ధం మొదలైంది. ఇరుదేశాల దౌత్యవేత్తలు, పౌరులు ఆయా దేశాలకు వెళ్ళిపోవాలనేది దాని సారాంశం! అంతేకాదు ఇరుదేశాలు సైనికులు సెలవులు రద్దుచేసి సరిహద్దులకు తరలిస్తున్నారు. అదే సమయంలో సింధూ జలాలు పాకిస్తాన్‌కు వదిలేది లేదని, మరో నది నుండి ఒక్కసారే ప్రాజెక్టు నీళ్ళు వరదలా వెళ్ళేలా చేయడం ఇవన్నీ ప్రచ్ఛన్న యుద్ధంలో భాగం కావచ్చును. కానీ, ఇరుదేశాల ప్రచ్ఛన్న యుద్ధ్దంలో నష్టపోయేది అంటూ, ఇటూ సామాన్య ప్రజలే? అయితే, మన బలగాలు అరేబియా సముద్రంలో క్షిపణి పరీక్షలు జరపడంతో, పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాస్ 130 అణ్వాయుధాలు ఎక్కుపెట్టి ఉన్నామని అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఇవన్నీ కూడా ఇరుదేశాలు ఆయుధ పాటవం చూపి ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడానికి పనికి వస్తాయి. యుద్ధం ప్రచారానికి బాగానే ఉంటుంది కానీ, అది ఇరుదేశాల సామాన్యుల జీవనసారం లాగేస్తుంది. ఇప్పుడు జరిగే యుద్ధాలేవీ రాజుల కాలంనాటి కత్తుల యుద్ధాలు కావు. ఆ రోజుల్లో బలమైన వాడు రెండు దెబ్బలు కొడితే, బలహీనమైనవాడు ఒక్క దెబ్బనైనా కొట్టేవాడు. కాని, నేడు ఆధునిక కాలం మారణాయుధాలతో పాటు కూటముల ప్రాధాన్యత ఉంటుంది. యుద్ధం ప్రారంభించడం తేలికే, ఆధునిక కాలంలో దాని ముగింపు యుద్ధం మొదలెట్టిన వారి చేతిలో ఉండదు. యుద్ధం గురించి వాగాడంబరాలు పలకడం ఎవరికైనా తేలికనే. కానీ, ఆ యుద్ధం చేయాల్సిన ఇరువైపుల సైనికులు, వారి కుటుంబాలు దినదిన గండంగా బతుకులు, నిత్యం, క్షణక్షణం మనోవేదనతో యుద్ధం అనివార్యం అవుతుంది.
మనిషి మనిషిగా శాంతిగా జీవించవలసిన మనిషి అకాల మృత్యువును ఆహ్వానించేదే యుద్ధం. ఆత్మగౌరవం పేరుతో, మత ఉగ్రవాదాల పేరుతో ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు, మారణహోమం చూసిన తర్వాత ఇరుదేశాలు సంయమనం కోల్పోవడం సరికాదు! యుద్ధం మిత్రుడు మిత్రుడు శత్రువు, శత్రువు శత్రువు మిత్రుడు లాంటి ఎన్నో విషయాలను ముందుకు తెస్తుంది. ఇప్పుడు ఇండియాకు ఇరుగుపొరుగు దేశాలతో పెద్ద సఖ్యత లేదు? పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ ఇలా అన్ని మనకు వ్యతిరేక సంకేతాలే? ఇంకా యుద్ధం ప్రక్కనే ఆయుధం వ్యాపారం ఉంటుంది. బేరసారాలు ఉంటాయి. ప్రజల క్షేమం కోసం వెచ్చించాల్సిన నిధులు దారితప్పడం వలన ద్రవ్యోల్బణం పొంచి ఉంటుంది. నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు అందనంత స్థాయికి పెరిగిపోతాయి. అది ఒక రకమైన నరకమే? ఇకపోతే ఆధునిక యుద్ధాలు చూద్దాం. ఒకనాడు అమెరికాతో ఢీ అంటే ఢీ అన్న, ప్రచ్ఛన్న యుద్ధం జరిపిన రష్యాతో ఉక్రెయిన్ ప్రారంభించిన యుద్ధం ముగింపు కనపడడం లేదు? ఇక ఇజ్రాయెల్ -పాలస్తీనా మధ్య దశాబ్దాల వైరం ఉంది.
హమాస్ సంస్థ ఉనికితో మొదలైన యుద్ధం గాజా గజగజా వణుకుతున్నది. పసిపిల్లల మరణాలు, అవయవాలు తెగిపడుతున్న అమానవీయ దృశ్యాలు నిత్యం చూస్తూనే ఉన్నాం. అమెరికా, రష్యా ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత అమెరికాలో సెప్టెంబర్ 11న ప్రపంచ వాణిజ్య భవనాలుపై ఉగ్రదాడి తర్వాత అమెరికా దూకుడుగా ఏకధ్రువ ఆధిపత్యంతో ముందుకు వచ్చింది. పాకిస్తాన్ సహకారంతో అఫ్ఘానిస్తాన్‌లో ముల్లా ఒమర్ ప్రభుత్వాన్ని దించేసింది. కువైట్ చమురు బావి వివాదంతో మొదలైన ఇరాక్ యుద్ధంలో రసాయనిక ఆయుధాల నెపంతో ప్రపంచంలో నెంబర్ వన్‌గా ఉన్న అమెరికా సద్దాం హుస్సేన్ రిపబ్లికన్ గార్డులను ఓడించింది. ఎప్పుడు అమెరికా వెన్నంటి ఉండే పాశ్చాత్య దేశాలు అమెరికాను కాదని ఉక్రెయిన్‌కు ఇచ్చిన భరోసా చూశాం. ఇవన్నీ ఆధునిక ప్రపంచంలో యుద్ధాల్లో మొదలైన తాజా పరిణామాలు.
కొన్ని బలహీన క్షణాల్లో యుద్ధాలకు దిగిన పాలకులు వెనక్కి రాలేక పతనం అవుతున్న స్థితి చూస్తున్నాం. ఇక రెండు ప్రపంచ యుద్ధాలు తర్వాత భయంకరమైన కరువు పరిస్థితి చూశాం. ఇప్పటికే పాకిస్తాన్‌లో కాస్తా ఎక్కువగా, మన దేశంలో కాస్తా తక్కువగా ధరలు పెరుగుదల ప్రజలకు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. స్వేచ్ఛగా, శాంతితో జీవించవలసిన ప్రజలు యుద్ధం వలన వచ్చే కృత్రిమ ఉపద్రవాలను చవిచూడాల్సి వస్తుంది. కనుక ఇప్పుడు మన దేశం, పాకిస్తాన్ యుద్ధ్ద పరిణామాలు దృష్టిలో పెట్టుకొని అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. దౌత్యం, లౌక్యంతో మెలిగే పాలకులే ఇప్పుడు ప్రపంచానికి, ప్రజలకు అవసరం.
- ఎన్ తిర్మల్, 94418 64514