మాంచెస్టర్: ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీం ఇండియా టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు కరుణ్ నాయర్ (Karun Nair). అయితే తనకు దొరికిన అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో జట్టులో అడుగుపెట్టిన ఇతను ఆడిన మూడు టెస్టుల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. దీంతో నాలుగో టెస్ట్‌లో అతన్ని పక్కన పెట్టారు. అయితే ఇప్పుడు కరుణ్ నాయర్ టెస్ట్ క్రికెట్ కెరీర్ కొనసాగింపుపై చర్చ నడుస్తోంది.
2016లో టెస్ట్ క్రికెట్‌లో అడుగుపెట్టిన కరుణ్ (Karun Nair).. ఇంగ్లండ్‌తో చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీతో అదరగొట్టాడు. అది మినహా అతను గొప్పగా ఆడిన ఇన్నింగ్స్ లేవు. అసలు కరుణ్‌కు ఎక్కువగా అవకాశాలు రాలేదు. దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రదర్శన చేశాడనే ఇప్పుడు ఇంగ్లండ్ పర్యటనకు అతన్ని సెలక్ట్ చేశారు. కానీ, అతనిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. అయితే కరుణ్ నాయర్‌కి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
నాలుగో టెస్ట్‌లో కరుణ్‌కు నో చెప్పి అతని స్థానంలో సాయి సుదర్శన్‌ని జట్టులోకి తీసుకున్నారు. దొరికిన అవకాశాన్ని సాయి సద్వినియోగం చేసుకున్నాడు. 151 బంతుల్లో 7 ఫోర్లతో 61 పరుగులు చేశాడు. దీంతో సాయి ఇలాగే రాణిస్తే.. కరుణ్ నాయర్‌కు చెక్ పడినట్లే అని నవజ్యోత్ సింగ్ సిద్ధూ సహా పలువురు మాజీలు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో స్టేడియంలో కూర్చొని కరుణ్ నాయర్ కంటతడి పెట్టుకోగా.. అతన్ని టీం ఇండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ ఓదారుస్తున్న ఫోటో ఒకటి చక్కర్లు కొడుతోంది. ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయిన కరుణ్.. ఇక టెస్ట్ క్రికెట్‌కి రిటైర్‌మెంట్ ప్రకటించే అవకాశం ఉందని అభిమానులు అనుకుంటున్నారు. మరి దీనిపై నిజానిజాలు తెలియాలంటే.. కొంతకాలం ఆగాల్సిందే.