బగ్లీహార్, కిషన్‌గంగా డ్యాం జలాల కుదింపు
న్యూఢిల్లీ : పాకిస్థాన్‌కు నదీ జలాల పంపిణీ నిలిపివేత విషయంలో భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పహల్గాం ఉగ్రదాడుల తరువాత భారతదేశం సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకుంది. ఇందులో భాగంగా ఇప్పుడు బగ్లీహార్ డ్యాంలోకి నీటి మట్టాన్ని తగ్గించింది. చినాబ్ నదీపై ఈ ఆనకట్ట నెలకొని ఉంది. తరువాతి క్రమంలో జీలం నదిపై ఉండే కిషన్‌గంగా డ్యామ్ వద్ద కూడా నీటి మట్టాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటారని అధికారులు ఆదివారం తెలిపారు.
బగ్లీహార్ డ్యాం వెంబడి ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులకు నీటి సరఫరా నియంత్రణ అంతా భారత్ చేతిలోనే ఉంటుంది. ఈ డ్యాం , దీనితో పాటు కిషన్‌గంగా డ్యామ్ హక్కులపై చిరకాలంగా భారత్ పాకిస్థాన్ మధ్య వివాదం రగులుతోంది. గతంలో దీనికి సంబంధించి పాకిస్థాన్ ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వాన్ని కోరింది. ఇక కిషన్‌గంగా డ్యామ్ విషయంలో కూడా చట్టపరమైన చిక్కులు తలెత్తాయి. నీలం నది, దీని ఉపనది జీలం ప్రవాహాలపై ఈ డ్యామ్ ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో చట్టపరమైన , దౌత్యపరమైన స్రూటిని అవసరం అని అంతర్జాతీయ సంస్థలకు పాకిస్థాన్ విజ్ఞప్తి చేసింది.