మన తెలంగాణ/హైదరాబాద్ : గోదావరి జలాల ను హైదరాబాద్‌కు మల్లన్నసాగర్ నుంచి తీసుకురావడం లేదని, శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి తీసుకొస్తామని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎల్లంపల్లి కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయ న చెప్పారు. తాటి చెట్టులా పెరిగినా హరీశ్ రావు కు బుద్ధి ఇంకా పెరగలేదని ముఖ్యమంత్రి ఫైర్ అ య్యారు. మూసీ పునరుజ్జీవం పనులకు సిఎం రేవంత్ రెడ్డి సోమవారం శ్రీకారం చుట్టారు. ఈ మేరకు గండిపేట్ లో రూ.7,360 కోట్ల వ్యయం తో చేపట్టబోయే గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ప్రాజెక్టు ఫేజ్ -2,3 పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మా ట్లాడుతూ నగర దాహర్తి తీర్చడానికే ఈ ప్రాజెక్ట్ చేపట్టామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల చొరవ వ ల్లే హైదరాబాద్ ప్రజల దాహం తీరుతుందన్నా రు. ఎవరు అడ్డొచ్చినా మూసీ ప్రక్షాళన చేస్తామన్నారు. త్వరలో మహారాష్ట్ర సిఎంను కలిసి తుమ్మి డి హట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణంపై చర్చిస్తామని సిఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
తుమ్మిడి హట్టి దగ్గర 150 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు కట్టి తీరుతామని రంగారెడ్డి, వికారాబాద్, చేవెళ్లకు సాగునీరందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. కలిసి రావాలని కడుపులో విషం పెట్టుకోవద్దని ముఖ్యమంత్రి విపక్షాలకు సూచించారు. కాంగ్రెస్‌పై కో పం ఉంటే తనతో కొట్లాడాలని, కానీ, అభివృద్ధికి అడ్డుపడొద్దన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ హైదరాబాద్‌కు తాగునీళ్లు అందించాలని ఎందుకు ప్రయత్నించలేదని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మూసీ పరిసర ప్రాంతాలన్నీ కలుషితం అయ్యాయని, ఎవరు అడ్డు పడ్డా ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్తామని ఆయన తెలిపారు. రూ. 360 కోట్లతో 20 టిఎంసీల గోదావరి జలాలు ఉస్మాన్‌సాగర్‌కు తరలిస్తామని ఆయన పేర్కొన్నారు.
పిజెఆర్ పోరాటంతోనే హైదరాబాద్‌కు మంజీరా నీళ్లు
హైదరాబాద్ అంటే గొప్ప పేరున్న నగరమని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గోదావరి జలాలను మూసీలో సమ్మేళనం చేస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 1908లో సిటీని వరదలు ముంచెత్తాయని, వరదలను ఆపడానికి ఆనాడు జంట జలాశయలాలను నిజాం రాజులు కట్టారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సిటీ దాహం తీరుతుందంటే దానికి నాడు నిజాం ముందు చూపే కారణమని ఆయన తెలిపారు. నేడు హైదరాబాద్‌లో కోటికిపైగా జనాభా ఉందని, జనాభా పెరుగుతున్న ప్రతిసారి తాగునీటి సమస్య వస్తోందని ఆయన అన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా, మంజీరా జలాలను సిటీకి తీసుకొచ్చిందన్నారు. 1965లో మంజీరానది నుంచి 2002లో కృష్ణానది జలాలను ఇలా మూడు దశల్లో నగరానికి నీటిని తరలించి ప్రజల దాహార్తిని తీర్చామని ఆయన తెలిపారు.
నగరానికి మంచి నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన చేసింది నిజాం తర్వాత కాంగ్రెస్సే అని ఆయన పేర్కొన్నారు. పిజేఆర్ పోరాటంతోనే హైదరాబాద్‌కు మంజీరా నీళ్లు వచ్చాయన్నారు. హైదరాబాద్ దాహం తీర్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని ఆయన తెలిపారు. కాంగ్రెస్ తెచ్చిన గోదావరి జలాలను నెత్తిమీద చల్లుకొని తామే ఏదో చేసినట్టు కొందరు నమ్మించారని, నెత్తిమీద నీళ్లు చల్లుకున్నంత మాత్రాన వాళ్ల పాపాలు తొలగిపోవని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాతే గోదావరి జలాల తరలింపు ముందుకు వెళుతుందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నల్గొండ ప్రజల కోరిక మేరకే మూసీ ప్రక్షాళన చేపడుతున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ప్రాజెక్టుతో మూసీ, నల్గొండ ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ ప్రక్షాళన కోసం మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం 40 శాతం…కాంట్రాక్టు సంస్థ 60 శాతం పెట్టుబడి…
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను మంచినీటితో నింపాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదేవిధంగా ఓఆర్‌ఆర్ ఫేజ్-2లోని ప్రాంతాలకు తాగునీటి సరఫరా కోసం చేపట్టిన ప్రాజెక్టులో నిర్మించిన 16 కొత్త రిజర్వాయర్లను కూడా సిఎం ప్రారంభించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హ్యామ్) విధానంలో చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 40 శాతం పెట్టుబడి పెడుతుండగా కాంట్రాక్టు సంస్థ 60 శాతం నిధులను సమకూర్చుకోనుంది. ఈ మొత్తం పనులు రెండేళ్లలో పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రధానంగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి 20 టిఎంసీల నీటిని తరలించనున్నారు.
దీంతో మూసీ పునరుజ్జీవానికి 4 టిఎంసీల నీటిని కేటాయించి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల్లో నింపనున్నారు. మిగతా 16 టిఎంసీలను హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు. నీటి తరలింపులో భాగంగా నగరంలో ఉన్న 7 చెరువులను కూడా అదే నీటితో నింపనున్నారు. 2027 డిసెంబర్ నాటికి హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు, ప్రతిరోజూ నల్లా నీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చేపడుతోంది. కాగా, సిఎం రేవంత్ రెడ్డి అంతకు ముందు కోకాపేటలోని నియోపోలిస్ ట్రంపెట్ జంక్షన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.