Friday, July 18, 2025

తిరోగమనంలో విండీస్ క్రికెట్

- Advertisement -
- Advertisement -

ఇప్పటికైనా తీరు మారాలి
లేకుంటే మనుగడ ప్రశ్నార్థకమే!
మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఒకప్పుడూ ప్రపంచ క్రికెట్‌లో ఎదురులేని శక్తిగా కొనసాగిన వెస్టిండీస్ జట్టు కొన్నేళ్లుగా వరుస ఓటములతో పతనావస్థకు చేరుకుంది. టి20 ఫార్మాట్‌లో తప్పిస్తే వన్డేలు, టెస్టులలో విండీస్ ఆట రోజురోజుకు తీసికట్టుగా తయారవుతోంది. 70, 80 దశకాల్లో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన విండీస్ 90 దశకానికి వచ్చే సరికి బలహీనంగా మారింది. అయితే బ్రియాన్ లారా, చందర్‌పాల్, క్రిస్ గేల్, శర్వాణ్ వంటి ఆటగాళ్ల వల్ల కాస్త పర్వాలేదనిపించింది. కానీ రెండు దశాబ్దాలుగా విండీస్ ఆట తీరు చాలా ఘోరంగా తయారైంది.

తొలి వన్డే వరల్డ్‌కప్‌లు గెలిచి మూడోసారి కూడా ఫైనల్‌కు చేరిన విండీస్ ఇటీవల కాలంలో మెగా టోర్నమెంట్‌కు అర్హత కూడా సాధించలేక పోయిందంటే దాని ఆటతీరు ఎంతగా పడిపోయిందో ఊహించుకోవచ్చు. తాజాగా ఆస్ట్రేలియాతో జమైకా వేదికగా జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 27 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని చవిచూసింది. 204 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్ ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి ఎదురు నిలువలేక తక్కువ స్కోరుకే కుప్పకూలింది. ఇది ప్రపంచ టెస్టు క్రికెట్‌లోనే రెండో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.

వివ్ రిచర్డ్, క్లైవ్ లాయిడ్, గ్యారీ సోబర్స్, డెస్మండ్ హేన్స్, గార్డెన్ గ్రినిడ్జ్, కోట్నో వాల్ష్, మాల్కమ్ మార్షల్, అంబ్రోస్, బ్రియాన్ లారా, చందర్‌పాల్, కార్ల్ హూపర్, బెంజిమన్ వంటి ఆటగాళ్లతో కూడిన విండీస్ చాలా ఏళ్ల పాటు ప్రపంచ క్రికెట్‌ను శాసించింది. అయితే ఈ ఆటగాళ్లు ఒక్కొక్కరూ జట్టుకు దూరం కావడంతో విండీస్ క్రికెట్ పతనం కావడం ప్రారంభమైంది. విండీస్ ఆట ఎంత దుస్థికి చేరిందంటే అది వరల్డ్‌కప్ వంటి టోర్నమెంట్‌కు అర్హత కూడా సాధించలేక పోతోంది. అఫ్గానిస్థాన్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, ఒమన్ వంటి చిన్న దేశాలు సయితం మెగా టోర్నీకి అలవోకగా అర్హత సాధిస్తుండగా విండీస్ మాత్రం వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించలేక పోతోంది.

బోర్డు వ్యవహార శైలివల్లే..

విండీస్ ఈ స్థితికి చేరిందంటే కరీబియన్ క్రికెట్ బోర్డు వ్యవహరిస్తున్న తీరే ప్రధాన కారణమని చెప్పక తప్పదు. పొలార్డ్, గేల్, రస్సెల్, డ్వేన్ బ్రావో, హోల్డర్, రోచ్ వంటి ఆటగాళ్లపై విండీస్ క్రికెట్ బోర్డు పెద్దలు వ్యవహరించిన తీరును ఎంత తప్పు పట్టినా తక్కువే. బోర్డు తీరుతో విసిగి పోయిన వీరు ప్రపంచ క్రికెట్‌లో జరుగుతున్న టి20 లీగ్‌ల వైపు దృష్టి సారించారు. ఐపిఎల్, పిసిఎల్, బంగ్లాదేశ్ లీగ్, బిగ్‌బాష్, సౌతాఫ్రికా టి20 లీగ్‌లలో విండీస్ క్రికెటర్లే ఎక్కువగా కనిపిస్తారు. ఐపిఎల్‌లో అయితే విండీస్ ఆటగాళ్లు తమదైన ముద్ర వేశారు. వీరిని జాతీయ జట్టు తరఫున ఆడేలా ఒప్పించడంలో విండీస్ బోర్డు పూర్తిగా విఫలమైంది. దీంతో విండీస్ ప్రస్తుతం ఈ దుస్థితికి చేరుకోక తప్పలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News