హైదరాబాద్: భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో (Operation Sindoor) భాగంగా పాక్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌పై తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్‌తో సాధించిందేమిటి.. కోల్పోయిందేమిటో చెప్పాలని ఆయన అన్నారు. మతం పేరిట రాజకీయాల్లో లబ్ధి పొందడం బిజెపికి పరిపాటి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ పరిరక్షణ కోసం సంవిధాన్ బచావో కమిటీ వేస్తామని తెలిపారు. 2026లో డీలిమిటేషన్ దృష్ట్యా.. పార్టీకి సలహాలు.. సూచనలు ఇచ్చేందుకు డీలిమిటేషన్ కమిటీ వేస్తామని అన్నారు.
అనంతరం మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) బిఆర్‌ఎస్ పార్టీపై మండిపడ్డారు. ఉనికి కోసమే బిఆర్‌ఎస్ నేతల ఆరాటం అని.. కవిత, కెటిఆర్, హరీశ్‌రావుల మధ్య పోరు నెలకొందని అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి బిఆర్‌ఎస్ కనపడదు అని తెలిపారు. తాజాగా మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. మంత్రి వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసత్య ప్రచారంపై సైబర్‌క్రైమ్‌లో కొండ సురేఖ ఫిర్యాదు చేస్తారని స్పష్టం చేశారు. తెలంగాణ సిఎం మార్పు అనేది ప్రతిపక్షాల కల్పి కుట్ర అని అన్నారు.