Wednesday, July 16, 2025

నరేంద్రుడి వారసుడు ఎవరు?

- Advertisement -
- Advertisement -

భారతీయ జనతా పార్టీ సిద్ధాంత మాతృక సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఆలోచ నాధార బిజెపి రాజకీయ అద్దంలో ప్రతిబింబిస్తుంది. సంఘ్ సర్వసత్తాక శక్తివంతుడైన సర్‌సంఘ్ చాలక్ మోహన్ మధుకర్‌రావ్ భాగవత్ మాటలంటే మామూలు విషయం కాదు. వాటిని తేలికగా తీసుకోవడానికి లేదు. సందర్భంతో నిమిత్తం లేకుండా ఎవరైనా 75 ఏళ్లకు రాజకీయ పదవుల్లోంచి, హోదాల్లోంచి వైదొలగాలనే మాట ఆయన పదేపదే చెబుతున్నారు. ఎన్నికల సమయంలో చెప్పడం కంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75 ఏళ్ల వయసు సమీపిస్తున్నప్పుడు చెప్పడంతో ఆ మాటలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

మూడు పర్యాయాలు వరుసగా గెలిచి కేంద్రంలో పాలన సాగిస్తున్న బిజెపి ప్రధానమంత్రి మోడీ వారసుడెవరు? అన్న చర్చ ఒకటైతే, అది ఎప్పుడు? అన్న ఉపచర్చ మరొకటి. 2029 ఎన్నికల ముందు వస్తారా? మోడీ 75 నిండటంతోనే వస్తారా? అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న అంశం! ఈ చర్చ ఎక్కడిదాకా వెళ్లిందంటే .. వచ్చే సెప్టెంబరు నాటికి 75 నిండటంతో మోడీ స్వచ్ఛందగానే తప్పుకోవాలనే ఒక స్వరం పార్టీలోనే పెరిగేంత! ఒక పుస్తకావిష్కరణ సభలో భాగవత్ మాట్లాడుతూ, మోరోపంత్ పింగ్లే ఏమన్నారంటే, “నువ్ 75కు వచ్చావం టే దానర్థం నువ్ దిగిపోయి ఇతరులకు అవకాశం ఇవ్వాల్సిందే” అన్నట్లు చెప్పారు. ఎవరికి దారివ్వాలి? ఆ వచ్చే దెవరు? ఎప్పుడు ‘వెంటనేనా? 2029 ఎన్నికల ముందా?’ ఇవన్నీ సమాధానం రావాల్సిన ప్రశ్నలే!

పార్లమెంట్ ఎన్నికలు 2029లో జరగనున్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిలో ఇప్పటి నుండే వ్యూహ ప్రతివ్యూహాలు ప్రారంభమయ్యాయి. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే అంశం కంటే ఎవరిని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించి ముందు కెళ్లాలనే చర్చోపచర్చలు పార్టీలో కంటే ఎక్కువగా ఆర్‌ఎస్‌ఎస్‌లో మొదలయ్యాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం లో కీలకమైన హోం మంత్రి అమిత్ షా ‘రాజకీయాల నుంచి ఇక రిటైర్ అవుతాను’ అంటూ చేసిన ప్రకటన ఒక విషయాన్ని స్పష్టం చేయడంతోపాటు పార్టీలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ ప్రకటనతో బిజెపిలో రెండో తరం రాజకీయ నేతలు వైదొలగడానికి సిద్ధపడుతున్నట్లున్నారు. బిజెపి మొదటి తరం అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి తదితరుల తరం ఇప్పటికే రాజకీయాల నుంచి నిష్క్రమించింది. బిజెపిలో రెండో తరానికి చెందిన నరేంద్ర మోడీ, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు ఇప్పటికే 70 ఏళ్ళ వయసు పైబడ్డారు.

ఆర్‌ఎస్‌ఎస్ విధాన నిర్ణయం ప్రకారం 70 ఏళ్ళు దాటిన వారు వానప్రస్థం స్వీకరించాలి. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రి అయిన నరేంద్ర మోడీ 2014 వరకూ ఓటమి ఎరుగని సిఎంగా కొనసాగిన అనంతరం జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన ఆయన అప్రతిహతంగా ప్రధాన మంత్రిగా కొనసాగుతున్నారు. మోడీ ప్రస్తుత వయసు 74 ఏళ్లు. 2029 నాటికి 78 ఏళ్ళు అవుతాయి. అంటే 2029 ఎన్నికల్లో ఆయన బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఉండే అవకాశాలు ఉండకపోవచ్చు. మోడీ కూడా ఓటమి ఎరుగని పాలకుడిగానే తన రాజకీయ ప్రస్థానాన్ని ముగించాలని భావిస్తారు. దీర్ఘకాలికంగా ప్రధానిగా ఉన్న ఆయన పై సహజంగానే వ్యతిరేకత కూడా పెరుగుతుందనే విషయం ఆర్‌ఎస్‌ఎస్‌కు తెలియంది కాదు.2024 ఎన్నికల్లోనే కొంత వ్యతిరేకత బయటపడింది. ఈ నేపథ్యంలో మోడీని 2029 ఎన్నికల్లో ప్రధాన మంత్రి అభ్యర్థిగా కొనసాగించడం రాజకీయ కోణంలో సరైన నిర్ణయం అవ్వదు. అటు మోడీ గౌరవంగా ఇటు బిజెపి రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఉభయ తారకంగా కొత్త నేతను ప్రధాన మంత్రి అభర్థిగా ప్రకటించడం తెలివైన వ్యూహం అవుతుంది. 1996 నుంచీ బిజెపి ఈ వ్యూహంతో పలుమార్లు సఫలమైంది. 2014 నుండి ఈ వ్యూహం విజయవంతగా సాగుతుండడంతో 2029లో కూడా బిజెపి ఆర్‌ఎస్‌ఎస్ సూచనలతో ఇదే పంథాను అనుసరించవచ్చు.

వయోభారం కారణంగానే మోడీ తప్పుకుంటే బిజెపి రెండో తరం నేతలందరికీ అదే సూత్రం వర్తిస్తుంది. అందుకే అమిత్ షా ముందుగానే తన రాజకీయ రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయనకు ప్రస్తుతం 60 ఏళ్లు. 2029 నాటికి 64 ఏళ్లకు చేరుకుంటారు. మోడీ ఉంటేనే అమిత్ షా బలం. మోడీ లేకుండా ఆయన బలవంతుడు కాదు. అంతేకాక, వరుసగా గుజరాత్ రాష్ట్రానికి చెందిన మరో నేతను ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి ఆర్‌ఎస్‌ఎస్ సమ్మతించదు. మరో సీనియర్ నేత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ కూడా 70 ఏళ్ల కేటగిరిలోకే వస్తారు. 2029లో ప్రధాన మంత్రి పదవి ఎలానూ దక్కదు కాబట్టి అంతకు ముందుగానే 2027లో రాష్ట్రపతి పదవిని ఆయన ఆశించవచ్చు.

మరో సీనియర్ నేత, ఆర్‌ఎస్‌ఎస్‌కు అత్యంత సన్నిహితుడు, పరిపాలనా దక్షుడు నితిన్ గడ్కరీకి వయోభారంతోపాటు ఆరోగ్య సమస్యలున్నాయి. మోడీ సమకాలికుడు, మూడుసార్లు మధ్యప్రదేశ్ సిఎంగా చేసి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ వయసు కూడా పైబడింది. కాబట్టి బిజెపి రెండో తరం నేతలెవరికీ 2029 ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థి అవకాశాలు మృగ్యమే. రాబోయే 20 ఏళ్లపాటు బిజెపికి బలమైన నాయకత్వం ఉండాలన్నది ఆర్‌ఎస్‌ఎస్ వ్యూహం. ఇదే ఆలోచనతో ఎల్‌కె అద్వానీని పక్కనపెట్టి 2014లో మోడీని ప్రధాని అభ్యర్థిగా తీసుకొచ్చిన ఎత్తుగడ ఫలించింది. విజయవంతమైన అదే వ్యూహాన్ని 2029 ఎన్నికల్లో కూడా అనుసరించే అవకాశాలున్నాయి. అంటే 50 ఏళ్ల వయసు కేటగిరిలో ఉన్న నేతకే ఆర్‌ఎస్‌ఎస్ ప్రాధాన్యతిస్తుందనేది సుస్పష్టం. ఈ నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి ముందు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రధాన రేసులో ఉంటారు. హిందుత్వ కోణమే ప్రధాన కొలబద్ద అయితే యోగి ఆదిత్య నాథ్‌కు ఎక్కువ మార్కులు పడతాయి. కానీ పరిపాలనా దక్షత కోణంలో దేశవ్యాప్తంగా ఆయనకు ఆమోదనీయత తక్కువే. బిజెపి ప్రధాన ఓటుబ్యాంకు అయిన మధ్య తరగతి వర్గాలు, ఆధునిక భావాలున్న యువతరం యోగి అంత సానుకూలత చూపదు.

కార్పొరేట్, పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు కూడా అంత సుముఖంగా ఉండవు. సన్యాసం స్వీకరించిన రాజకీయ నేత ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి వరకూ నెగ్గుకు రావచ్చు గానీ దేశ ప్రధాన మంత్రి పదవికి ఎంపిక చేయాలి అంటే ఇమేజ్ పరంగా ప్రతికూలమే. సంకీర్ణ ప్రభుత్వం అనివార్యత ఏర్పడితే యోగి అభ్యర్థిత్వానికి మిత్రపక్షాల మద్దతు అంత తేలిక కాదు. మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌కు అత్యంత ఆప్తులే. ఆర్‌ఎస్‌ఎస్ హెడ్‌క్వార్టర్స్ అయిన నాగపూర్‌కు చెందిన ఫడ్నవీస్ ఆధునిక హిందుత్వవాది. ఒకప్పటి ప్రమోద్ మహాజన్, ప్రస్తుత మోడీ తరహాలో కార్పొరేట్ శైలి హిందుత్వానికి ఆయన ప్రతీక. దేశంలో మధ్య తరగతి వర్గాలను, ఆధునిక యువతరాన్ని ఆకట్టుకునే శైలి ఆయనది. రాజకీయ ఎత్తులు పైఎత్తుల్లో ఫడ్నవీస్ దిట్ట. మరోవైపు ఆయన పరిపాలనా దక్షుడుగా కూడా గుర్తింపు పొందారు.

2014లో మోడీకి సానుకూలంగా ఉన్న అంశాలన్నీ ప్రస్తుతం ఫడ్నవీస్‌కూ ఉన్నాయి. బిజెపి అంటే గిట్టని వర్గాల్లో నరేంద్ర మోడీ పట్ల ఉన్నంత తీవ్ర వ్యతిరేకత ఫడ్నవీస్ పట్ల ఉండకపోవడం ఆయనకు అదనపు బలం. ప్రస్తుతం 54 ఏళ్ల వయసున్న ఫడ్నవీస్‌కు 2029 నాటికి 58 ఏళ్లు వస్తాయి. వయసు రీత్యా ఆయనకు బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. ఒడిశాకు చెందిన ధర్మేంద్ర ప్రధాన్‌కు బలమైన ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యంతోపాటు కేంద్ర మంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉంది. కాకపోతే జనాదరణ కోణంలో ధర్మేంద్ర ప్రధాన్‌కు ఎక్కువ మార్కులు పడవు. ఒడిశాలో 2024లో తొలిసారి బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆయనను ముఖ్యమంత్రిగా చేయలేదు.

అటువంటిది ప్రధాన మంత్రి అభ్యర్థిగా ధర్మేంద్ర ప్రధాన్ పేరును ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి ఎంత వరకు పరిశీలిస్తాయో సందేహమే. 2027 వరకూ ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్మూ రాష్ట్రపతిగా ఉంటారు. ఈ కారణంగా కూడా 2029లో అదే రాష్ట్రానికి చెందిన ధర్మేంద్ర ప్రధాన్‌ను బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు తక్కువే. ఆయన బిజెపి జాతీయ అధ్యక్షుడు కావచ్చు. గానీ ప్రధాన మంత్రి అభ్యర్థి అయ్యే అవకాశాలు తక్కువే. ఈ సమీకరణాల నేపథ్యంలో బిజెపి దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా దేవేంద్ర ఫడ్నవీస్‌ను ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఆర్‌ఎస్‌ఎస్ నిర్ణయించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ ఏడాది దసరా పండుగ నాటికి వందేళ్ళు పూర్తి చేసుకోబోతున్న ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి కొత్త ప్రధాన మంత్రి అభ్యర్థి ఎంపిక దిశగా ఎప్పుడు కార్యాచరణకు ఉపక్రమిస్తుందో వేచిచూడాలి. ప్రధాన మంత్రి అభ్యర్థి ప్రకటనకు మరో మూడేళ్ల సమయం ఉంది. అంతలో సమీకరణల్లో ఏమైనా మార్పులు చోటు చేసుకోవచ్చు. మరి కొన్ని పేర్లు కూడా చర్చకు రావచ్చు. కాలానుగుణంగా ఎలాంటి మార్పుచేర్పులు జరుగుతాయో వేచిచూడాలి.

దిలీప్‌రెడ్డి

సమకాలీనం

(రచయిత పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్ ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News