జీవితాంతం కలిసి జీవించాల్సిన భర్తే కాలయముడై భార్యను కడతేర్చిన ఘటన కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ మండలంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం.. స్థానిక జ్యోతినగర్ కాలనీలో సదాశివనగర్ గ్రామానికి చెందిన చిందం లక్ష్మి అలియాస్ లింగవ్వ (40)ను ఆమె భర్త చిందం రవి హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. శుక్రవారం రాత్రి చిందం రవి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. భార్య వంట చేస్తుండగా, దంపతుల మధ్య తగవు చోటుచేసుకుంది. ఆ సమయంలో భార్యభర్తను కొట్టిన కారణంగా కోపానికి గురై సమీపంలో ఉన్న రాయితో భార్యపై దాడి చేశాడు.
ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. వారికి ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు సురేశ్ హైదరాబాద్‌లో ఉండగా, చిన్న కుమారుడు మహేష్ దుబాయ్‌లో పనిచేస్తున్నాడు. సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంతోష్ కుమార్, ఎస్‌ఐ పుష్పరాజ్ ఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ ద్వారా ఫొటోగ్రఫీ, ఆధారాలు సేకరించారు. ఘటన సమాచారాన్ని మృతురాలి కుమారులకు అందజేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.