వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేయడానికి కుట్ర పన్నిన కేసులో భార్యతో పాటు నలుగురు నిందితులను కామారెడ్డి జిల్లా, నాగిరెడ్డిపేట పోలీసులు అరెస్టు చేశారు. డిఎస్‌పి శ్రీనివాసరావు ఎల్లారెడ్డిలోని తన కార్యాలయంలో బుధవారం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం..చిన్న ఆత్మకూరు గ్రామానికి చెందిన పల్లె సంపూర్ణ, పల్లె రవి భార్యాభర్తలు. సంపూర్ణకు అదే గ్రామానికి చెందిన జాన్సన్‌తో వివాహేతర సంబంధం ఉంది. తమ అక్రమ సంబంధానికి భర్త రవి అడ్డుగా ఉన్నాడని, అతనిని హత్య చేసి అడ్డు తొలగించాలని ప్రియుడికి ఆమె సూచించింది. ఇందుకు సుపారీగా లక్ష రూపాయలు చెల్లిస్తానని హామీ ఇచ్చింది. దీంతో జాన్సన్.. పల్లె రవి హత్యకు ప్రణాళిక రూపొందించుకున్నాడు. ఇందుకోసం చిన్న ఆత్మకూర్ గ్రామానికి చెందిన నవీన్, తాండూర్‌కు చెందిన చాకలి రాజు, మరో మైనర్ బాలుడితో కలిసి కుట్ర పన్నాడు. ఈనెల 25వ తేదీన పల్లె రవికి డబ్బులు అప్పుగా ఇస్తామని పెద్ద రెడ్డి గ్రామ శివారులో ఉన్న డంపింగ్ యార్డ్ వద్దకు రావాలని జాన్సన్ సూచించాడు.
అక్కడికి వచ్చిన పల్లె రవితో మద్యం తాగించారు. మత్తులో ఉన్న సమయంలో రవిపై సుత్తితో దాడి చేయడానికి నిందితులు ప్రయత్నం చేశారు. వారి నుంచి రవి తప్పించుకొని దగ్గర్లో ఉన్న ఫామ్ హౌస్‌వైపు పరుగెత్తి ప్రాణాలు రక్షించుకున్నాడు. ఫామ్‌హౌస్‌లో ఉన్న సిబ్బంది వెంటనే 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. గాయపడిన రవిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇదిలావుండగా, తన భర్తకు లక్ష రూపాయలు అప్పు ఇస్తానని చెప్పి, చంపేందుకు జాన్సన్‌ను ప్రయత్నించాడని పల్లె రవి భార్య సంపూర్ణ ఈనెల 26వ తేదీన పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో విచారణ జరుపగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నలుగురు నిందితులతోపాటు సంపూర్ణ కలిసి ఆమె భర్త రవి హత్యకు ప్రణాళిక రూపొందించిన విషయం వెల్లడైంది. అనంతరం ఆమెతో పాటు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి హత్య చేసేందుకు ఉపయోగించిన సుత్తితో పాటు మూడు మొబైల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు, రక్తపు మరకలు ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్‌పి వివరించారు. విలేఖరుల సమావేశంలో సదాశివనగర్ సిఐ సంతోష్ కుమార్, నాగిరెడ్డిపేట ఎస్‌ఐ భార్గవ్ తో పాటు సిబ్బంది ఉన్నారు.