Friday, July 18, 2025

పొమ్మనలేక పొగ?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితను బిఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసే దిశగా పార్టీ కార్యాచరణ సిద్ధం చేసుకుంటుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగిన సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీసుకున్న నిర్ణయం ఈ అనుమానాలను బలపర్చేవిధంగా ఉన్నాయి. పార్టీలో కొంతకాలంగా చోటు చేసుకున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే కవితను పార్టీ నుంచి బయటకి పంపించే ప్రయత్నాలకు ఊతం ఇచ్చేలాగా ఉన్నాయి. ఇటీవల ఎంఎల్‌సి తీన్మార్ మల్లన్న ఎంఎల్‌సి కవితపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపినా బిఆర్‌ఎస్ శ్రేణులు కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఏదో మొక్కుబడి పార్టీ సీనియర్ నాయకులు సిరికొండ మధుసూదనాచారి తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటన జారీ చేసి చేతులు దులుపుకున్నారు.

బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ కవిత వ్యాఖ్యలు చేసిన తర్వాత పార్టీలో ఒక్కసారిగా సమీకరణలు మారిపోయాయి. పార్టీ అధినాయకత్వం చెబితే తప్ప కవిత పాల్గొనే కార్యక్రమాలకు హాజరుకావద్దని అంతర్గతంగా ఆదేశాలు జారీ అయిన ట్లు ఒక ప్రెస్‌మీట్‌లో పరోక్షంగా ఆమెనే బయటపెట్టా రు. ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనేతలు తన కార్యక్రమాలకు హాజరుకాకపోయినా పార్టీ శ్రేణులు హాజరవుతున్నాయని ఆమె చెప్పడం గమనార్హం. అయితే బిఆర్‌ఎస్ అనుబంధ సింగరేణి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టిజిబిజికెఎస్) నుంచి ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితను తొలగిస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు టిజిబిజికెఎస్ వ్యవహారాల ఇంచార్జ్‌గా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ బాధ్యతలు అప్పగించారు. కవితను తొలగించి కొప్పుల ఈశ్వర్‌ను నియమించే అంశంలో కెటిఆర్ స్వతహాగా నిర్ణయం తీసుకునే అవకాశం ఏ కోశాన లేదు. పార్టీ అధినేత కెసిఆర్‌తో చర్చించిన అనంతరమే ఇంతటి కీలకమైన నిర్ణయం తీసుకుని ఉండవచ్చు అనే అభిప్రాయం పార్టీ వర్గాలలోనే వ్యక్తమవుతున్నది.
నేడు కవిత ఏం చెప్పబోతున్నది..?
బిఆర్‌ఎస్ అనుబంధ సింగరేణి కార్మిక సంఘం అధ్యక్ష పదవి నుంచి కల్వకుంట్ల కవితను తప్పించిన నేపథ్యంలో గురువారం ఆమె ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ తీసుకున్న ఈ కీలక నిర్ణయంపై కవిత ఏ విధంగా స్పందిస్తారో అన్న ఉత్కంఠ పార్టీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాలలో నెలకొన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News