Friday, August 29, 2025

కెసిఆర్ అసెంబ్లీకి వచ్చేనా..?

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరంపై కమిషన్ నివేదికపై చర్చించడమే ప్రధాన అజెండాగా శనివారం(ఆగస్టు 30) నుంచి రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అత్యంత కీలకమైన అంశం కావడంతో.. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరుగనున్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో నిర్ణయాలు తీసుకున్న తీరు.. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడంపై 16 నెలలపాటు విచారణ జరిపిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్, జూలై 31న ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. కాళేశ్వరం నివేదికపై ఇప్పటికే కేబినెట్‌లో చర్చ జరిగింది. అధికారులతో పాటు బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు బాధ్యులు అని పిసి ఘోష్ తేల్చడంతో అసెంబ్లీలో చర్చించి అందరి నిర్ణయాలు తీసుకున్న తర్వాత ముందుకెళ్తామని సిఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. తమకు పూర్తి నివేదిక అందిన తర్వాత అసెంబ్లీలో

ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ ఇప్పటికే హరీష్‌రావు వెల్లడించారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందినప్పటి నుంచే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరుగనున్న నేపథ్యంలో ఇరుపక్షాల మధ్య వాడివేడిగా మాటల యుద్ధం జరిగే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్రంగానే కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కెసిఆర్ అసెంబ్లీకి వస్తారా..? లేక ఎప్పటిలానే శాసనసభ సమావేశాలకు దూరంగానే ఉంటారా…? అనేది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ అసెంబ్లీకి వస్తే ఏం మాట్లాడతారని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా, అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌తో మాజీ మంత్రి హరీష్‌రావు శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో చర్చించినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News