సింధు జలాలపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధు ఒప్పందం ప్రకారం పాక్ కు సంబంధించిన వాటా జలాలను మళ్లీంచేందుకు భారత్ చేపట్టే ఏ నిర్మాణమైనా ధ్వంసం చేస్తామని అన్నారు. జమ్ముకాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత, పాకిస్తాన్ వ్యవసాయ భూమిలో 80శాతంకు నీటిని అందించే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మంత్రి.. వరుసగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఓ ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ జలాలను మళ్లించడం తీవ్రంగా పరిగణించబడుతుందని పునరుద్ఘాటించారు. నీటిని మళ్లించడం కోసం సింధు నది పరీవాహక ప్రాంతంలో భారత్ ఆనకట్టలు నిర్మించడానికి ముందుకు వస్తే.. పాకిస్తాన్ స్పందన ఏమిటని అడగగా.. “అది పాకిస్తాన్‌పై దురాక్రమణ అవుతుంది. వారు(భారతదేశం) ఈ రకమైన నిర్మాణ ప్రయత్నం చేస్తే.. పాకిస్తాన్ ఆ నిర్మాణాన్ని ధ్వంసం చేస్తుంది” అని పేర్కొన్నారు.