Friday, July 11, 2025

మగువలు రాస్తున్న మరణ శాసనాలు

- Advertisement -
- Advertisement -

మూడు ముళ్ల సాక్షిగా చివరి వరకు తోడునీడగా ఉంటామని వాగ్దానం చేసుకున్న వివాహబంధాలు ఛిద్రమైపోతున్నాయి. క్షణిక సుఖంకోసం వివాహేతర సంబంధాలు సభ్యసమాజానికి తలవంపులు తీసుకు వస్తున్నాయి. గతంలో మహిళలపై (జరిగిన) జరుగుతున్న దాడులు, హత్యలు, అకృత్యాలల్లో పురుషాధిపత్యం కొనసాగింది. కాని ఇప్పుడు వరసగా జరుగుతున్న సంఘటలను మహిళలకు తలవంపులు తీసుకు వస్తున్నాయి. మూడు కాలాల పాటు భర్త, పిల్లాపాపలతో హాయిగా జీవించాల్సిన మహిళలు జైళ్ల పాలవుతున్నారు. తద్వారా ఇరుకుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.

సోషల్ మీడియా గుప్పెడు ప్రపంచంగా మారిన సందర్భంలో వాటి మాయలోపడి హత్యలు ఎలా చేయాలో కూడా ప్రణాళికలు వేసుకునే దారుణ పరిస్థితులకు రావడం ఆందోళనకర అంశం. మగువల రాస్తున్న వరుస మరణశాసనాలు సమాజంలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన రెండు మూడు సంఘటనలు మహిళా లోకానికి మచ్చతీసుకు వచ్చింది. గతంలో నాగర్‌కర్నూలకు చెందిన స్వాతిరెడ్డి షాద్‌నగర్‌లో ప్రియుడి మోజులో పడి ఏకంగా సినిమా క్రైమ్ థ్రిల్లర్ తరహాలో ఏకంగా తన భర్తను చంపించిన ఘటన అప్పట్లో రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆమెను చూడడానికి చివరికి తల్లిదండ్రులు, పిల్లలు కూడా రాకపోవడంతో ఆమె జైలులోనే ఉంటోంది.

ఆమెను ఒక రకంగా సమాజం సామాజిక బహిష్కరణకు గురి చేసిందనే చెప్పాలి. ప్రస్తుతం అలాంటివే గత రెండు వారాలుగా జిల్లాలో వరసు సంఘటనలు చోటుచేసుకోవడం మగువుల దారుణాలు వెలుగులోకి రావడంతో సమాజం ఎటువైపు వెళ్తోందన్న భయం పట్టుకుంది. రెండు వారాల క్రితం గద్వాల జిల్లాకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ పెళ్లైన నెల రోజులు గడవక ముందు దారుణ హత్యకు గురికావడం, ఆ హత్య వెనుక భార్య ఐశ్వర్యే ఉండడంతో రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తమ వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని భావించిన ఐశ్వర్య తన ప్రియుడు తిరుమల రావుతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. గద్వాలకు చెందిన తేజశ్వర్, కర్నూలు జిల్లా కేంద్రంలోని కల్లూరు ఎస్టేట్‌కు చెందిన సుజాత కూతురు ఐశ్వర్యతో గత ఏడాది డిసెంబర్‌లో నిశ్చితార్థం జరిగింది.

వాస్తవానికి ఈ వివాహం తేజశ్వర్ కుటుంబ సభ్యలకు ఇష్టం లేదు. నిశ్చితార్థం సందర్భంగా కూడా ఐశ్వర్య ఐదు రోజులుపాటు అజ్ఞాతంలోకి వెళ్లింది. తేజేశ్వర్ ఫోన్ చేసినా స్పందించలేదు. తర్వాత తేజేశ్వర్‌కు ఫోన్ చేసిన ఐశ్వర్య తాను ఎక్కడికి వెళ్లలేదని నీవంటే నాకు చాలా ప్రేమంటూ చెప్పుకొచ్చింది. ఇది నమ్మిన తేజేశ్వర్ పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ ఏడాది మే నెలలోనే బీచుపల్లి వద్ద ఘనంగా వివాహం చేసుకున్నాడు. పెళ్లి అయినప్పటినుంచి రోజు ఫోన్‌లో మాట్లాడు తుండడంతో తేజేశ్వర్‌కు అనుమానం కల్గింది. ఇరువురి మధ్య కొంత మనస్పర్ధలు ఏర్పడ్డాయి. తేజశ్వర్ జూన్ 17 మిస్‌కావడంతో సోదురుడు గద్వాల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులకు నిందితులను పట్టుకొని విచారించడంతో క్రైం థ్రిల్లర్ సినిమాను తలదన్నే రీతిలో మర్డర్ జరిగింది.

ఈ హత్య వెనుక కర్త, కర్మ, క్రియ అంతా కర్నూల్‌లోని బ్యాంక్ మేనేజర్ తిరుమల్‌రావు. అప్పటికే తిరుమల రావు స్వీపర్ (ఐశ్వర్య తల్లి) సుజాతకు లోన్ ఇప్పించి లోబర్చుకున్నాడు. ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న సందర్భంలోనే అప్పుడప్పుడు సుజాత కూతరు ఐశ్యర్య కూడా బ్యాంకు రావడంతో తిరుమలరావు ఐశ్వర్యతో పరిచడం పెంచుకొని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అప్పటికే తిరుమల రావుకు భార్య ఉన్నప్పటికీ పిల్లలు లేకపోవడంతో భార్యకు విడాకులు ఇవ్వాలనుకున్నాడు. అయితే భార్య నిరాకరించడంతో మొదట భార్యనే కడతేర్చాలనుకున్న తిరుమలరావు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాడు.

ఈ సందర్భంలోనే గద్వాలలో తేజేశ్వర్‌తో వివాహం నిశ్చయంకావడం, పెళ్లి జరగడంతో ఐశ్వర్య తో కలడం ఇబ్బందిగామారింది. దీంతో తిరుమలరావు కుటుంబాన్ని కర్నూల్లో పెట్టాలని ఐశ్వర్యను కోరారు. కర్నూల్‌లో కాపురం పెట్టేందుకు ఐశ్వర్య భర్త తేజేశ్వర్‌ను కోరగా అందుకు నిరాకరించాడు. దీంతో కక్ష పెట్టుకున్న తిరుమలరావు, ఐశ్వర్య, తల్లి సుజాత కలిసి పక్కా ప్లాన్ రూపొందించారు. తేజేశ్వర్‌ను చంపాలని ఐదు సార్లు రెక్కి నిర్వహించారు. సామాజిక మాధ్యమాలను వెతికారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకున్న హనీమూన్ మర్డర్‌ను స్టడీ చేశారు. అలాగైతే దొరికి పోతామని సాక్షాలు లేకుండా చేద్దామని భావించారు. చివరికి తేజేశ్వర్ మర్డర్‌కు తిరుమల రావు కర్నూల్‌లోని కొందరికి రూ. 20 లక్షలకు సుఫారి ఇచ్చారు. ఆ గ్యాంగ్ తేజేశ్వర్‌ను మర్డర్ చేసేందుకు పక్కా ప్లాన్ రూపొందించారు.

తేజేశ్వర్ ఎక్కడెక్కడ ఉన్నాడని తెలుసుకునేందుకు బైక్‌కు జిపిఎస్ ట్రాకర్ పరికరాన్ని రహస్యంగా అమర్చి అతని జాడ వెతకసాగారు. జూన్ 17 గద్వాలకు వచ్చిన సఫారి గ్యాంగ్ తేజేశ్వర్‌ను పొలం సర్వే చేసే పని ఉందని చెప్పి కారులో తీసుకెళ్లి అదే రోజు అతన్ని గద్వాల సమీపంలోనే దారుణంగా కారులోనే హత్య చేశారు. హత్య చేసి సాక్షాలు లేకుండా చేసేందుకు తేజేశ్వర్ ఫోన్‌ను, బ్యాగును బీచుపల్లి కృష్ణానదిలో వేసి తిరుమలరావుకు ఫోన్ చేశారు.

తిరుమలరావు ఆదేశాల మేరకు కొత్త బట్టలు మార్చుకొని తేజేశ్వర్ డెడ్‌బాడీని ఇక్కడ కాకుండా కర్నూల్ జిల్లా పాణ్యం సమీపంలో తండా వద్ద కాలువలో పడేశారు. అంతకు ముందు హత్య తర్వాత అండమాన్‌కుగాని, ఇతర దేశాలకు వెళ్లి స్థిరపడాలని తేజేశ్వర్, ఐశ్వర్యలు భావించారు. కాని డామిట్ కథ అడ్డం తిరిగింది. వీటి వెనుక ప్రధానంగా ప్రేమించిన వ్యక్తితో వివాహం కాలేకపోవడం, ఆ తర్వాత భర్తను హత్య చేయడం, వివాహమైనా తర్వాత ఇతరులతో వివాహేతర సంబంధం కొనాసాగించడం, అది భర్తలకు తెలిసిన వెంటనే భర్తలను ప్రియుళ్లతో హత్యల చేయించే వరకు మగువలు వెళ్తున్నారు. ఈ పరిణామాలు సమాజంలో పలు చర్చలకు దారితీస్తున్నాయి.

బిజి రామాంజనేయులు,
(ఉమ్మడి మహబూబ్‌నగర్ బ్యూరో ఇన్‌చార్జీ)
(90598 95411)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News