కుటుంబ కలహాలతో విసుగు చెందిన ఓ మహిళ తన ముగ్గురు కుమార్తెలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం కన్మనూరుకు చెందిన లోకమని నాగరాజు (35) లోకమని సుజాత (32) ఇద్దరు 15 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి అక్షిత (13) ఉదయశ్రీ (11) వర్షిని (6) ముగ్గురు కూతుర్లతో కలిసి హైదరాబాద్‌లోని నారపల్లి రోడ్లపై చెరుకు రసం అమ్ముతూ జీవనోపాధి గడుపుతున్నారు.ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న నాగరాజు ఇటీవల తరచు గొడవలు జరుగుతుండడం వల్ల వారి వైవాహిక సంబంధం దెబ్బతింది. ని
న్న రెండు వైపులా పెద్దలు తమ సమస్యలను పరిష్కరించడానికి పంచాయతీని ఏర్పాటు చేశారు. అయితే బుధవారం రాత్రి దంపతులు గొడవ పడుతూనే ఉండడంతో నిరాశ చెందిన సుజాత గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు నారపల్లి చెరువుకు తీసుకెళ్లి వారితోపాటు నీటిలోకి దూకింది.కొంతమంది స్థానికులు ఈ సంఘటనను చూసి ఇద్దరు పిల్లలను రక్షించగలిగారు. దురదృష్టవశాత్తు మహిళ, తన చిన్న కుమార్తె వర్షిణి నీటిలో మునిగి చనిపోయారు. వారి మృతదేహాలను వెలికితీసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు పిల్లలను కూడా గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు బంధువులు తెలిపారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.