గయ: హోంగార్డ్ నియామక పరీక్షలో భాగంగా ఫిజికల్ టెస్టులో పాల్గొనేందుకు వచ్చిన ఓ మహిళ అభ్యర్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషాద సంఘటన బీహార్ లో చోటుచేసుకుంది. గయ జిల్లాలో నిర్వహించిన శారీరక పరీక్ష సమయంలో బాధితురాలు స్పృహ కోల్పోవడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా.. అంబులెన్స్‌లోనే ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన జూలై 24న బోధ్ గయ సమీపంలో జరిగింది. నియామక పోటీలో కుప్పకూలిపోయిన తనను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్తూ.. మార్గమధ్యలో డ్రైవర్, టెక్నీషియన్ తనపై లైంగిక దాడి చేశారని బాధితురాలు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. సీనియర్ అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి సిసిటివి ఫుటేజ్‌లను పరిశీలించి నిందితులను గుర్తించారు. ఈ దారుణానికి పాల్పాడిన అంబులెన్స్ డ్రైవర్ వినయ్ కుమార్, టెక్నీషియన్ అజిత్ కుమార్‌లను ఫిర్యాదు చేసిన రెండు గంటల్లోనే పోలీసులు అరెస్టు చేశారు.