నవమాసాలు మోసి, కనిపెంచిన తల్లే ఇద్దరు చిన్నారుల ఊపిరి తీసింది. భార్యాభర్తల మధ్య తరచుగా జరుగుతున్న కలహాలు చివరికి అమాయక చిన్నారుల ప్రాణాలను బలితీసుకున్నాయి. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ధర్మారం గ్రామానికి చెందిన లక్ష్మణ్, రత్నమ్మ దంపతులు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చి బాచుపల్లిలో కూలీగా జీవనం సాగిస్తున్నారు. వీరికి నలుగురు మగ సంతానం. ఇద్దరు పెద్ద పిల్లలు జగన్ (9) పవన్ (8) స్వగ్రామంలో ఉండగా, ఇద్దరు చిన్నారులు అరుణ్ (3), సుభాష్ (08 నెలలు) తల్లిదండ్రులతో బాచుపల్లిలోనే ఉంటున్నారు. ఇటీవల భార్యభార్యల మధ్య ఫ్యామిలీ ప్లానింగ్ విషయమై తరచూ వాగ్వాదాలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి కూడా ఇదే విషయమై తగవులు చెలరేగాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 9 గంటలకు భర్త లక్ష్మణ్ ఇటుకలు లోడింగ్ ఉందని పనికి వెళ్లగా ,
రత్నమ్మ మనస్తాపానికి గురై మధ్య రాత్రి ఇద్దరు పిల్లలను నీటి సంపులో పడేసి, తానూ దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఆ సమయంలో పొరుగింటి వ్యక్తి బయటకు వచ్చి గమనించి గట్టిగ అరవగా, స్థానికులు చేరుకొని రత్నమ్మను బయటకు తీశారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ఈ ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌కు కేవలం 100 మీటర్ల దూరంలో, కమ్యూనిటీ హాల్ వెనుక భాగంలోనే చోటుచేసుకోవడం స్థానికులను ఆశ్చర్యపోయారు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు బాచుపల్లి పోలీసులు తెలిపారు.