సింగరేణి సంస్థలో ఇప్పటి వరకు జనరల్ అసిస్టెంట్లుగా, ట్రాన్స్‌ఫర్ వర్కర్లుగా పనిచేస్తున్న మహిళలు ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలపై ఆపరేటర్లుగా పని చేయడానికి సింగరేణి యాజమాన్యం అవకాశం కల్పించేందుకు నిర్ణయించింది. మైనింగ్ లో మహిళాసాధికారత లక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సింగరేణి సంస్థ సిఎండి ఎన్.బలరామ్ వెల్లడించారు. మైనింగ్ రంగంలో మహిళల సాధికారత, సమాన అవకాశాలు, మానవ వనరుల సమర్థ వినియోగంలో భాగంగా ఇలాంటి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలపై ఆపరేటర్లుగా పని చేయడానికి ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తునన్నామని, దీనిపై ఇప్పటికే సర్కలర్ విడుదల చేసినట్లు తెలిపారు.
విద్యా అర్హత ఏడో తరగతి
ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్ లేదా బదిలీ వర్కర్ గా పనిచేస్తున్న 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి కనీసం ఏడవ తరగతి పాసైన మహిళా అభ్యర్థులు ఈ ఆపరేటర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే మహిళలు శారీరక సామర్థ్యం కలిగి, కనీసం ద్విచక్ర వాహనం, నాలుగు చక్రాల వాహన డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలి. ఆగస్టు 2024 కంటె ముందు డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. అర్హతలు కలిగిన మహిళా ఉద్యోగులు నిర్దేశించిన ధరఖాస్తులను నింపి సంబంధిత గని మేనేజర్, శాఖాధిపతి, జనరల్ మేనేజర్ కు అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ తర్వాత జనరల్ మేనేజర్ సిపిపి నేతృత్వంలోని ఒక కమిటీ దరఖాస్తులను పరిశీలించి కనీస అర్హతలు గల అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
సిరిసిల్లాలో శిక్షణ
కమిటీ ఎంపిక చేసిన మహిలా అభ్యర్థులు సిరిసిల్లలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ సంస్థ హెవీ గూడ్స్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ విభాగంలో శిక్షణ పొందాల్సి ఉంటుంది. శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ఖాళీల లభ్యతను బట్టి నిర్వహించే ఎంపిక పరీక్షలో ఉత్తీర్ణులు అయిన వారికి ఈపీ ఆపరేటర్ ట్రైనీ ఐదో కేటగిరి హోదాలో సంబంధిత ఏరియాలకు పంపిస్తారు.
Also Read: యుపిఎస్‌సి తరహాలో పరీక్షలు నిర్వహించండి: రాంచందర్ రావు