Wednesday, August 13, 2025

వారం రోజుల్లో సరెండర్ కావాల్సిందే..

- Advertisement -
- Advertisement -

భారత మాజీ రెజ్లర్ సుశీల్ కుమార్ బెయిల్‌ను దేశ అత్యున్నత న్యాయం స్థానం సుప్రీం కోర్టు రద్దు చేసింది. వారం రోజుల్లో సరెండర్ కావాల్సిందేనని సుశీల్‌కు ఆదేశాలు జారీ చేసింది. గత మార్చి 4న ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన బెయిల్ ఉత్వర్వులను జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్‌లతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ రద్దు చేసింది. జూనియర్ రెజ్లింగ్ ఛాంపియన్ సాగర్ ధన్కర్ హత్య కేసు విషయంలో రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం సుశీల్ కుమార్ బెయిల్‌పై ఉన్నాడు. కాగా, సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ మృతుడు సాగర్ ధన్కర్ తండ్రి అశోక్ ధన్కర్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. సిద్ధార్థ్ మృదుల్ ధన్కర్ తరఫున వాదనలు వినిపించారు. సుశీల్ కుమార్ తరఫున ప్రముఖ న్యాయవాది మహేశ్ జెఠ్మలాని వాదించారు. కాగా, వీరి వాదనలు విన్న తర్వాత సుప్రీం కోర్టు సుశీల్ కుమార్ బెయిల్‌ను రద్దు చేసింది. అంతేగాక వారం రోజుల్లో లొంగిపోవాలని ఆదేశించింది.

ఇదిలావుంటే 2021లో ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో ధన్కర్‌తో పాటు అతని ఇద్దరు స్నేహితులపై సుశీల్ కుమార్ దాడి చేశాడని కేసు నమోదైంది. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన సాగర్ ధన్కర్ ప్రాణాలు విడిచినట్టు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. అప్పటి నుంచి సుశీల్ కుమార్ 18 రోజుల పాటు తప్పించుకుని తిరగసాగాడు. కానీ ముంద్కా ప్రాంతంలో సుశీల్‌ను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. దీంతో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సుశీల్ కుమార్‌ను రైల్వే శాఖ ఉద్యోగం నుంచి తొలగించింది. అక్టోబర్ 2022లో ఢిల్లీ ట్రయల్ కోర్టు సుశీల్ కుమార్ సహా 17 మందిపై వివిధ అభియోగాలను నమోదు చేసింది. ఢిల్లీ పోలీసుల చార్జ్‌షీట్ ప్రకారం సాగర్ హత్య కేసులో సుశీల్ కుమార్ కీలక పాత్ర పోషించినట్టు తేలింది. కానీ అతను మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చాడు. కాగా మూడున్నరేళ్ల పాటు జైలులో గడిపిన సుశీల్‌కు గత మార్చి 4న ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది. తాజాగా సుప్రీం కోర్టు బెయిల్‌ను రద్దు చేయడంలో సుశీల్ మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News