Sunday, June 1, 2025

హార్వర్డ్‌లో చదివిన జిన్‌పింగ్ కుమార్తె..అమెరికాలో రహస్య జీవనం ?

- Advertisement -
- Advertisement -

అమెరికా లోని చైనీయుల వీసాలను రద్దు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్టు ఆ దేశ విదేశాంగ మంత్రిమార్కో రూబియో ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా నిర్ణయంపై చైనా విద్యార్థుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన రాజకీయ కార్యకర్త లారా లూమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కుమార్తె జి మింగ్జి మసాచుసెట్స్‌లో నివసిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. మింగ్జిను కెమెరా ముందుకు తీసుకు వచ్చి ఆమె తండ్రి విధానాల గురించి ప్రశ్నిస్తానంటూ లూమర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టులు తమ దేశానికి చెందిన వారు కాదని ఆమె వ్యాఖ్యానించారు. లూమర్ వ్యాఖ్యలతో జి మింగి అంశం తెరపైకి వచ్చింది. దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.

అత్యంత రహస్యంగా జీవనం
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కుమార్తె జి మింగ్జి . ఆమె జీవితం అత్యంత రహస్యంగా కొనసాగుతోంది. చైనా లోని బెజియాంగ్ యూనివర్శిటీలో చదువుతున్నారు. ఆ తరువాత వేరే పేరుతో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె తిరిగి చైనాకు వెళ్లిపోయారు. అయితే తన చదువును కొనసాగించేందుకు ఆమె తిరిగి హార్వర్డ్‌కు వచ్చి ఉండవచ్చని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మింగ్జి ఉంటున్న ప్రాంతం , ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను చైనా అధికారులు ఎప్పటికప్పుడు ఎవరికీ తెలియకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో ఆమె ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుంది అనే దానిపై కచ్చితమైన సమాచారం లేదు. కాగా ఆమె ప్రభుత్వ భద్రతలో మసాచుసెట్స్‌లో ఉంటున్నట్టు పలు కథనాలు వెల్లడిస్తున్నాయి.

యూఎస్‌లో చదువుతున్న చైనా విద్యార్థుల్లో కొందరి వీసాలు రద్దు చేయనున్నట్టు రూబియో ప్రకటించారు. వారిలో చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలున్నవారు కూడా ఉంటారన్నారు. అయితే దీన్ని బీజింగ్ తీవ్రంగా ఖండించింది. ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావోనింగ్ మాట్లాడుతూ యూఎస్ చర్య రాజకీయ ప్రేరేపితమైనదన్నారు. జాతీయ భద్రత ముసుగులో అమెరికా భావజాలాన్ని ఆయుధంగా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా, యూఎస్ లోని ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కారుకు మద్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమం లోనే జి మింగ్జి గురించి బయటకు రావడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News