మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. తొలి వికెట్‌కి కెఎల్ రాహుల్‌తో కలిసి 94 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశాడు. అయితే వోక్స్ వేసిన 30వ ఓవర్ చివరి బంతికి రాహుల్(46) క్రాలీకి క్యాచ్ ఇచ్ఛి హాఫ్ సెంచరీకి చేరువలో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన సాయి సుదర్శన్‌తో కలిసి జైస్వాల్ నిలకడగా ఆడుతున్నాడు. గత మ్యాచ్‌లో పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డ జైస్వాల్.. ఈ మ్యాచ్‌లో తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదురుకుంటూ పరుగులు సాధిస్తున్నాడు.
ఈ క్రమంలో 96 బంతుల్లో 9 ఫోర్లు 1 సిక్సు సాయంతో అర్థ శతకం సాధించాడు. ప్రస్తుతం 39 ఓవర్లు ముగిసేసరికి భారత్ 1 వికెట్ నష్టానికి 120 పరుగులు చేసింది. క్రీజ్‌లో జైస్వాల్(58), సుదర్శన్(13) ఉన్నారు. ఈ క్రమంలో జైస్వాల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్‌పై 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఇంగ్లండ్‌పై అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు. 16 ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డు సాధించి భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. రాహుల్ ద్రవిడ్ మాత్రం ఈ మైలురాయిని 15 ఇన్నింగ్స్‌లో సాధించారు.