వారణాసి: ప్రముఖ యోగా గురువు, స్వామి శివానంద(128) ఆదివారం వారణాసిలోని ఆయన నివాసంలో కన్నుమూశారు. 1896 ఆగస్టు 8న ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న సిల్హెత్ జిల్లాలో ఆయన జన్మించారు. ఆరేళ్ల వయస్సులోనే శివానంద తల్లిదండ్రులు మృతి చెందారు. దీంతో ఆయన వెస్ట్ బెంగాల్‌లోని ఓ ఆశ్రమంలో పెరిగారు. గురు ఓంకారానంద గోస్వామి.. శివానందను పెంచారు. ఆయనకు యోగా వంటి ఆధ్యాత్మిక విషయాలను నేర్పించారు. దీంతో ఆయన తన జీవితాన్న సమాజసేవకు అంకితం చేశారు. గత 50 సంవత్సరాల్లో ఆయన 400-600 వరకూ కుష్టు రోగులకు సేవ చేశారు.
ఆయన చేసిన కృషికి గాను 2022లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా శివానంద పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. శివానంద మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ, యూపి ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. ఆయన ఆధ్యాత్మిక సాధనకు, యోగా రంగానికీ చేసిన అసమానమైన కృషిని మోదీ కొనియాడారు. దేశంలోని ప్రతి తరానికి ఆయన ఆదర్శమని.. ఆయన మృతి యోగా రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు.