Wednesday, June 25, 2025

గ్లోబల్ స్పోర్ట్ హబ్‌గా తెలంగాణ: శ్రీధర్ బాబు

- Advertisement -
- Advertisement -

2036 ఒలింపిక్స్ లో తెలంగాణ బ్రాండ్
మెరిసేలా కొత్త స్పోర్ట్ పాలసీ వచ్చే ఏడాదిలో
యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్సిటీ :మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ను ‘గ్లోబల్ స్పోర్ట్ హబ్’ గా మార్చాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. 2036 ఒలింపిక్స్ లో తెలంగాణ బ్రాండ్ మెరవాలనే సంకల్పంతోనే కొత్త స్పోర్ట్ పాలసీకి శ్రీకారం చుట్టామన్నారు. మంగళవారం నిజాంపేట్ సమతానగర్ లో ‘ఎస్‌ఎల్వీ ప్రో బ్యాడ్మింటన్ స్టేడియం’ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఒకప్పుడు క్రికెట్ ను మాత్రమే క్రీడగా భావించేవారని, ఇప్పుడా పరిస్థితి మారిందని, ఇతర క్రీడలకు ప్రాధాన్యం పెరిగిందని, తల్లిదండ్రుల ఆలోచన తీరులోనూ మార్పు వచ్చిందని వివరించారు. హైదరాబాద్ అంటే అందరికీ బిర్యానినే గుర్తుకొచ్చేదని, ఇప్పుడు బిర్యానీతో పాటు బ్యాడ్మింటన్ కూడా గుర్తుకొస్తుందన్నారు.

గోపీచంద్, సైనా నెహ్వాల్, పీవీ సింధూ, చిరాగ్, సాత్విక్ లాంటి ప్రముఖ క్రీడాకారులు ఇక్కడి నుంచే ప్రయాణాన్ని ప్రారంభించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది చిన్నారులు బ్యాడ్మింటన్ ను కెరీర్ గా ఎంచుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిస్తున్నారని వెల్లడించారు. బ్యాడ్మింటన్ హబ్ గా హైదరాబాద్ మారడంలో గోపీచంద్ పాత్ర కీలకమని చెప్పారు. తమ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, 2026లో యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్సిటీని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు. అన్ని గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేయబోతున్నామని, త్వరలో గచ్చిబౌలిలో బాలికల కోసం ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ అసోసియేషన్ అకాడమీని ప్రారంభించబోతున్నట్లు వివరించారు.

రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో స్పోరట్స్ స్కూల్స్ ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని, ప్రతిభ గల క్రీడాకారులను వెలికి తీసి వారిని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడిగా బ్యాడ్మింటన్ కేవలం హైదరాబాద్ కే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకెళ్లేందుకు చేస్తున్న కృషిని వివరించారు. ఆసక్తి గల క్రీడలో చిన్నారులు రాణించేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News