ఆన్లైన్ బెట్టింగ్‌లకు బానిసై అప్పుల పాలైన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన వికారాబాద్ జిల్లా, మర్పల్లి మండల పరిధిలోని కోట మర్పల్లి గ్రామంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బాధితుడి కుటుంబీకులు, రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. బోయిని పాండు కుమారుడు విజయ్ కుమార్ (23) గత కొంతకాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటుపడ్డాడు. గ్రామంలో, తెలిసిన వారి దగ్గర సుమారు మూడు లక్షల రూపాయల వరకు అప్పులు చేసి ఆన్లైన్ బెట్టింగ్‌లో నష్టపోయాడు. అప్పులు తీర్చేమార్గం కానరాక మనస్థాపానికి
గురై గత కొద్ది రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఇంటి నుండి బైక్‌పై వెళ్తూ కొత్తలాపూర్-మర్పల్లి గ్రామాల మధ్యలో ఉన్న రైలుపట్టాల మధ్య రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు లోకో పైలట్ యువకుడిని చూసి ఎన్నోసార్లు హారన్ కొటినా జరగలేదు. దీంతీ ఈ విషయాన్ని మర్పల్లి రైల్వే స్టేషన్ అధికారులకు తెలపడం వారు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వికారాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మండలంలో తీవ్ర విషాదాన్ని నింపింది.