కారు అదుపుతప్పి వాగులో బోల్తాపడిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం…చేవెళ్ల మున్సిపల్ కేంద్రానికి చెందిన బిజెవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గుడుపల్లి నితీష్ రెడ్డి (27) మంగళవారం రాత్రి పామేన గ్రామంలో పని నిమిత్తం చేవెళ్ల- పామేన నక్షబాట వైపు తన కారులో వెళ్ళాడు. చేవెళ్ల మున్సిపల్ సమీపంలోని పెద్దవాగులో కారు అదుపుతప్పి బోల్తాపడింది. బుధవారం ఉదయం అటుగా వెళ్తున్న వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి జెసిబి సహాయంతో
కారును పైకి తీయగా ఈ ప్రమాదంలో నితీష్ రెడ్డి మృతదేహం కనిపించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుని తల్లి గతంలో మృతి చెందగా తండ్రి ఇటీవల మరణించాడు. మృతునికి భార్య, చెల్లెలు ఉన్నారు. అంత్యకియాల్లో చేవెళ్ల ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బిజెవైం జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్, మాజీ ఎంఎల్‌ఎ కెఎస్. రత్నం, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సెవెల్ల మహేందర్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు హాజరై నితీష్ రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.