జూరాల జలాశయం వద్ద ప్రమాదం జరిగింది. జలాశయాన్ని చూసేందుకు వచ్చిన ఓ యువకుడు వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. చనిపోయిన యువకుడిని గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని ఏ.బూడిదపాడుకి చెందిన మహేశ్(23)గా పోలీసులు గుర్తించారు. ఈరోజు స్నేహితుడితో కలిసి బైక్ పై జూరాల ప్రాజెక్టును చూసేందుకు వచ్చిన మహేష్.. తిరిగి వెళ్లిపోతుండగా వెనుక నుంచి కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మహేష్.. బైక్ పైనుంచి ఎగిరి ప్రాజెక్టు గేట్ల ముందు పడి వరద నీటీ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. స్థానికులు సాయంతో శ్రమించి యువకుడిని బయటకు తీసుకొచ్చారు. అయితే, అప్పటికే తీవ్రంగా గాయపడి మహేష్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.