Wednesday, August 13, 2025

రాహుల్ గాంధీతో టచ్‌లో చంద్రబాబు: వైఎస్ జగన్

- Advertisement -
- Advertisement -

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో టచ్‌లో ఉన్నారని వ్యాఖ్యానించారు. తాడేపల్లిలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీపై సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల చోరీ అంశాన్ని లేవనెత్తుతున్న రాహుల్ గాంధీ కర్నాటక, మహారాష్ట్ర గురించి మాత్రమే మాట్లాడుతున్నారని, ఏపీ గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. దీనికి రాహుల్ గాంధీతో చంద్రబాబు టచ్‌లో ఉండడమే కారణమన్నారు. ఏపీ గురించి ఎందుకు మాట్లాడరని, ఎన్నికల రోజు, కౌంటింగ్ రోజు ఫలితాలకు మధ్య 12.5 శాతం ఓట్ల తేడా ఉందన్నారు. 48 లక్షల ఓట్లు ఎలా పెరిగాయని, ఇది ఎలా సాధ్యమని నిలదీశారు. రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడకపోవడానికి కారణం రేవంత్‌రెడ్డి ద్వారా హాట్‌లైన్‌లో రాహుల్‌గాంధీతో చంద్రబాబు టచ్‌లో ఉంటారని విమర్శించారు.

ఏపీలో ప్రజాస్వామ్యం కనబడడం లేదు : ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో శాంతిభద్రతలు లేవనేందుకు పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల సందర్భంగా జరిగిన దాడులే నిదర్శనమన్నారు. కలెక్టర్ సమక్షంలో దొంగ ఓట్లు వేయడం, పోలీసులే దగ్గరుండి రిగ్గింగ్ జరిపించడాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీలో ప్రజాస్వామ్యం కనబడడం లేదని, ప్రజాస్వామ్యం లేదన్నది ఎన్నికల్లో రుజువైందన్నారు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చెప్పేందుకు పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలే ఉదాహరణ అని తెలిపారు. పోలింగ్ బూత్‌లలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు లేరని, ఏజెంట్లను లేకుండా చేసి పోలీసుల ప్రోద్బలంతో రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరపించారు. దేశంలో పోలింగ్ బూత్ ఏజెంట్లు లేకుండా ఎన్నికలు జరిగింది ఇక్కడేనన్నారు. పోలింగ్ బూత్ ఏజెంట్లకు కొన్ని హక్కులు, బాధ్యతలు ఉంటాయన్నారు. నకిలీ ఓటర్లను గుర్తించడం, అభ్యంతరాలను తెలియజేయడం, పోలింగ్ వివరాలను తెలుసుకోవడం వంటి బాధ్యతలు ఉంటాయని జగన్ తెలిపారు. పోలింగ్ ఏజెంట్లను నియమించుకునేందుకు ఫామ్ -12 ఇస్తారని, వైఎస్సార్‌సీపీ ఏజెంట్ల నుంచి ఫామ్ -12ను పోలీసులు, టీడీపీ నేతలు లాక్కున్నారన్నారు.

ఏజెంట్లు లేకుండా ఎన్నిక జరగడం చరిత్రలో ఎక్కడా లేదు : పోలింగ్ ఏజెంట్లు లేకుండా ఎన్నిక జరగడం చరిత్రలో ఎక్కడా చూడలేదని, ప్రజాస్వామ్యం ఇంతలా దిగజారిపోయిన పరిస్థితులు ఏపీలోనే చూస్తున్నామన్నారు. ఎన్నిక ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్ సీల్ పై కూడా ఏజెంట్ సంతకం తీసుకుంటారని, ఇవన్నీ ఎన్నికలో జరిగాయా? ఏజెంట్లే లేకుండా జరిగితే వాటిని ఎన్నికలు అంటారా? అని ప్రశ్నించారు. ఇదే తరహాలో ఎన్నికలు జరిపితే హాస్యాస్పదమే అవుతుందన్న ఆయన ఇంతటి దానికి ఎన్నికలు జరపడం దేనికని నిలదీశారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, దోచుకో.. పంచుకో.. తినుకో.. ఇదే వారి విధానం అంటూ నిప్పులు చెరిగారు. ఒకప్పుడు బందిపోట్ల పేరు చెబితే వినిపించే చంబల్ లోయను మరిపించేలా చంద్రబాబు పులివెందుల ఎన్నిక జరిపారని, సాక్షాత్తూ పోలీసులు దగ్గరుండి ప్రోత్సహించారని మండిపడ్డారు. ప్రజలు మీకు ఓటు వేస్తారనే నమ్మకం ఉంటే ఎన్నికలను రద్దు చేసి.. కేంద్ర బలగాల సమక్షంలో ఎన్నికలు జరపాలని చంద్రబాబుకు జగన్ సవాల్ విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News