పాకిస్తాన్ కాల్పుల్లో వీర మరణం పొందిన మురళీ నాయక్ కుటుంబానికి మాజీ సిఎం, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా కల్లితండాకు వెళ్లి.. వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారిని ఓదార్చి.. వైసిపి అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
అనంతర జగన్ మీడియాతో మాట్లాడుతూ.. జవాను మరణిస్తే ఆర్థిక సాయం చేసే సంప్రదాయం తమ ప్రభుత్వం తెచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం కూడా ఇదే విధానంను కొనసాగిస్తోందని.. ఇందుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్న చెప్పారు. మురళీ నాయక్ త్యాగానికి ప్రజలంతా రుణపడి ఉండాలని.. మురళీ నాయక్ కుటుంబానికి అన్ని విధాలా తోడుగా ఉంటామని అన్నారు. దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన మురళీ నాయక్ ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాని జగన్ పేర్కొన్నారు. కాగా, ఎపి ప్రభుత్వం ఇప్పటికే మురళీ నాయక్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం, ఐదు ఎకరాల భూమి, జిల్లా కేంద్రంలో ప్లాటు ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే, డిప్యూటీ సిఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగతంగా రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.