దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో నా అనుబంధం తలచుకున్నప్పుడల్లా నా హృదయం బరువెక్కుతుంది. గొంతుమూగబోయి కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతాయి. డా. వైఎస్‌ఆర్ అందరిలాంటి రాజకీయ నాయకుడు కాదు. అత్యంత ప్రేమపాత్రుడైన అగ్రశ్రేణి నేత. తన సహచర నాయకుల భుజంతట్టి చిరునవ్వుతో భరోసా ఇవ్వగలిగిన మహానేత. అలాంటి మహానాయకుణ్ణి అకాలంగా విమాన ప్రమాదంలో కోల్పోవడం ఇప్పటికీ జీర్ణించుకోలేనిది. డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేనూ జాతీయ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం ఎంతో ఆత్మీయంగా కలిసి పనిచేసాం. గుండెలనిండా ప్రేమతో అన్నా అని నేను పిలిచేవాడిని. ఏమయ్యా రఘు అంటూ నన్ను సంబోధించేవారు.
ఇద్దరిదీ రాయలసీమ కావడంతో ఈ ప్రాంత రైతుల కష్టాలు, కడగండ్లపట్ల ఎంతో బాధ్యతతో స్పందించేవాళ్ళం. నేనూ స్వయంగా ఒక రైతును. నాలాగే డా. వైఎస్‌ఆర్ కూడా ఒక రైతు. ఆయన కడపలో ఉంటే ఉదయమే లేచి ఆయన ఎస్టేట్‌లో తిరుగుతూ వ్యవసాయం ఎలా ఉందో నిశితంగా పరిశీలించేవారు. కడపలో కాకుండా వేరే ఏ ప్రదేశంలో ఉన్నా ఉదయం లేవగానే ఊరికి ఫోన్ చేసి తన వ్యవసాయం ఏవిధంగా ఉందో విచారించేవాడు. 2003లో చేపట్టిన పాదయాత్రలో డా వైఎస్‌ఆర్ అన్ని ప్రాంతాల్లోని రైతుల దుఃఖాలను దగ్గరగా హృదయంతో విన్నారు. ప్రత్యక్షంగా రైతులతో చర్చించినప్పుడు వారి సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలనే సంకల్పం పెంచుకున్నారు. ఆనాడు అధికారంలో ఉన్న ప్రభుత్వం వ్యవసాయంపట్ల, రైతులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బాధిత రైతులు వైఎస్‌ఆర్ పాదయాత్రకు ఉద్విగ్నంగా స్వాగతం పలకడమే కాకుండా ఆయన్ని వెంబడిస్తూ తమ సమస్యలను వివరించుకుంటూ జిందాబాద్ వైఎస్‌ఆర్ అంటూ నినదించేవారు.
రైతుల దయనీయ పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన తర్వాత తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయానికి, రైతులకు అధిక ప్రాధాన్యం తొలి ప్రాధాన్యం ఇస్తామనీ, ఉచిత కరెంటు ఇస్తామని, కరెంటు చార్జీలు మాఫీ చేస్తామని కష్టాల్లో ఉన్న రైతులకు భరోసా ఇస్తూ మండుటెండల్లో పాదయాత్రను కొనసాగించారు. 2004లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా డా. వై రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగానే రైతులకు ఉచిత విద్యుత్ పైన, కరెంటు బకాయిల మాఫీ ఫైళ్ళపైన తొలి సంతకం పెట్టారు. ఆ తర్వాత నన్ను పిలిచి నీకు వ్యవసాయ శాఖ ఇస్తున్నాను. బాగా పనిచేయాలి. మనం ఎప్పటినుంచో చర్చించుకుంటున్న అంశాలపై రైతులకు న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. నాకు ఇచ్చిన బాధ్యతను అత్యంత ఇష్టంగా పని చేసాను. వైఎస్‌ఆర్ పాలనలో రైతులకు ఉచిత విద్యుత్, రుణాలపై వడ్డీ మాఫీ, రైతులకు పావలా వడ్డీకే రుణాలు, సబ్సిడీ విత్తనాలు, పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీలు అందించడంలో అప్పటి వరకూ 2 శాతంగా ఉన్న వ్యవసాయాభివృద్ధి 4 శాతానికి పెరిగింది.
పంట దిగుబడి అధికంగా రావడంతో ‘మోన్‌సాంటో’ అనే అమెరికన్ కంపెనీ నుండి బిటి పత్తివిత్తనాలను రైతులు కొనుగోలు చేయడం మొదలైంది. అయితే మోన్‌సాంటో కంపెనీ అధిక ధరలకు బిటి విత్తనాలను అమ్మడంతో రైతుల నుండి విత్తనాల ధరలు తగ్గించాలనే డిమాండ్ వచ్చింది. నకిలీ బిటి విత్తనాలు కూడా మార్కెట్‌లోకి రావడంతో వేలాదిగా రైతులు నష్టపోయారు. ఆ సమయంలో సుప్రీం కోర్టులో కేసు వేసాము. కొంతకాలం తర్వాత సుప్రీంకోర్టు రైతులకు అనుకూలంగా తీర్పు నివ్వడంతో బిటి విత్తనం ధరం 1200 నుంచి 650 తగ్గింది.
2004లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన యుపిఎ ప్రభుత్వం రైతుల కష్టాలను తీర్చేందుకు అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రధాని డా. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం దేశంలోని రైతులకు సుమారు 72 వేల కోట్ల రూపాయల రుణమాఫీ అమలు చేయడంతో ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 11,500 కోట్ల రూపాయల రుణమాఫీని రైతులు పొందారు. అప్పటికే కొంతమంది రైతులు తమ రుణాలు చెల్లించడంతో వారిని ప్రోత్సహించాలని ప్రతి రైతుకూ 5 వేల రూపాయల ఇన్‌సెంటివ్ కింద ఇవ్వాలని డా. వైఎస్‌ఆర్ నిర్ణయించడంతో రుణాలు చెల్లించిన రైతులు కూడా హర్షం వ్యక్తం చేసారు. ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం వ్యవసాయంపై అవగాహన ఉన్న శరద్ పవార్‌ను వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించింది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వ్యవసాయంపై సమావేశాన్ని ప్రధాని పిలిచారు.
ఆ రోజు వైఎస్‌ఆర్ ముఖ్యమైన పని ఉండటంతో ఆ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా నేను హాజరై రాష్ట్రంలో వైఎస్‌ఆర్ ప్రభుత్వం చేపడుతున్న రైతు అనుకూల విధానాలను వివరించాను.నా ప్రజెంటేషనన్‌ను ప్రధాని మన్మోహన్‌సింగ్, వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవారు ఎంతో ఆసక్తిగా విని ఆంధ్రప్రదేశ్‌ను నమూనాగా భావించాలని ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు వారు చెప్పారు. ప్రపంచం లో ఏ దేశంలోనూ లేని విధంగా ఎపిలో సుమారు 6,20,000 పొదుపు సంఘాలు ఉన్నాయని వీటిలో కోటి మందికి పైగా సభ్యులు ఉన్నారని వైఎస్‌ఆర్ బుష్‌కు వివరించి చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న రైతుల సంక్షేమాన్ని, వ్యవసాయ ప్రోత్సాహకాలను బుష్ దృష్టికి తీసుకెళ్ళారు. తళతళ మెరిసే పంచికట్టుతో, చిరునవ్వుతో ఎప్పుడూ రైతుల పక్షం వహించి అత్యంత ప్రాధాన్యతతో నిర్ణయాలు చేస్తున్న డా. వైఎస్‌ఆర్‌ను అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్ అభినందిస్తూ మీరు మంచి రాజకీయ నాయకులే అనుకున్నాను అంతకుమించి మీరు మంచి రైతు నాయకులు కూడా అని కితాబు ఇచ్చారు.
ఆ రోజు వైఎస్‌ఆర్ అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్‌కు పెద్ద గుమ్మడికాయను బహూకరించడంతో బుష్ ఆశ్చర్యపోయారు. రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను కనుగొనడానికి ప్రముఖ ఆర్థిక నిపుణరాలు, ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొ. జయతిఘోష్ నేతృత్వంలో ఒక నిపుణుల కమిటీ వేయాలని డా. వైఎస్‌ఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు అయిదు నెలలపాటు రాష్ట్రమంతా పర్యటించిన జయతిఘోష్ కమిటి 176 సిఫారసులతో నివేదిక ఇచ్చింది. వైఎస్‌ఆర్ వెంటనే అన్ని శాఖలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సిఫారసులను అన్నింటినీ అమలు చేయమని ఆదేశాలు ఇచ్చారు. డా వైఎస్‌ఆర్ సిఎం అయ్యేనాటికి ఎపి ఆగ్రోస్ సంస్థ పూర్తిగా నిర్వీర్యమై ఉన్నది. రైతులకు తక్కువ ధరతో నాణ్యమైన యంత్రాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించి నేను వైఎస్‌ఆర్ దృష్టికి తీసుకెళ్ళాను.వ్యవసాయానికి, రైతులకు ఎన్ని మంచిపనులు చేస్తున్నప్పటికీ ఏ ఒక్కరైతు ఆత్మహత్య చేసుకోవడానికి వీల్లేదనే దృఢ సంకల్పంతో డా. వైఎస్‌ఆర్ ఉండేవారు.
ఈ సంకల్పంలో భాగంగా 1998 నుండి 2005 వరకూ రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటానికి గల కారణాలను అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు సూచించాలని విశ్రాంత న్యాయమూర్తి రాంచెన్నారెడ్డితో కమిషన్ ఏర్పాటు చేసారు. ఈ కమిషన్ 34 సిఫారసులతో నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలోని 34 సిఫారసులను వెంటనే అమలు చేయాలని డా. వైఎస్‌ఆర్ ఆదేశాలు జారీ చేసారు. రైతు సంక్షేమంపట్ల రాజశేఖర్ రెడ్డికి ప్రత్యేక శ్రద్ధ ఉండబట్టే ఇలా ఎన్నెన్నో కార్యాచరణలను చేపట్టారు. డా వైఎస్‌ఆర్ నేతృత్వంలో చేపట్టిన జలయజ్ఞంలో అనేక తాగు, సాగునీటి ప్రాజెక్టులకు యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయాలని ఆయన సంకల్పించారు. రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు ప్రాధాన్యతో పూర్తి చేయడానికి పూనుకున్నదీ చెప్పాలంటే అది పెద్ద వ్యాసం అవుతుంది.
డా. ఎన్.రఘువీరారెడ్డి
(సిడబ్ల్యుసి సభ్యులు)