అమరావతి: ఎపి మద్యం కుంభకోణం వెనుక కుట్రలు పూర్తిగా వెలికి తీయాలని ఎపిసిసి చీఫ్ షర్మిల (Sharmila) తెలిపారు. ఎపి లిక్కర్ స్కామ్ చాలా పెద్దది అని అన్నారు. కుంభకోణం ఓ ఆర్థిక నేరమని విమర్శించారు. మద్యం కుంభకోణంపై వైఎస్ షర్మిల స్పందించారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో షర్మిల మాట్లాడుతూ..ఎక్కడా లేని విధంగా గత వైసిపి ప్రభుత్వం ఆర్థిక నేరానికి పాల్పడిందని, ఎపి లిక్కర్ స్కామ్ పై సమగ్ర విచారణ జరపాలని అధికారులకు సూచించారు. వైసిపి మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలను (Facts murdercase) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాచి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్యాష్ లెస్ మద్యం అమ్మకాలను గత ఐదేళ్లు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. బ్లాక్ మనీ కోసమే డిజిటల్ పేమెంట్ నిలిపివేశారని మండిపడ్డారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు సూటిగా సమాధానం చెప్పాలి అని ఒక్క రూ. 3,500 కోట్లే మద్యం స్కామ్ కాదని, పన్నులు ఎగ్గొట్టాలనే నగదుతోనే అమ్మకాలు చేశారని ధ్వజమెత్తారు. డిజిటల్ పేమెంట్ ఆపడం వెనుక అవినీతి దాగి ఉంది అని అనుమానం వ్యక్తం చేశారు. ఎపి లిక్కర్ స్కామ్ పై జగన్ సమాధానం చెప్పాలి అని షర్మిల డిమాండ్ చేశారు.