హరారే: శ్రీలంకతో శనివారం జరిగిన రెండో టి20లో ఆతిథ్య జింబాబ్వే టీమ్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో జింబాబ్వే సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలి టీ20లో లంక జయకేతనం ఎగుర వేసింది. ఈ మ్యాచ్‌లో గెలిచి జింబాబ్వే ప్రతీకారం తీర్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక 17.4 ఓవర్లలో కేవలం 80 పరుగులకే కుప్పకూలింది. కామిల్ (20), కెప్టెన్ అసలంక (18), శశాంక (15)లు మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. మిగతా వారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో లంక ఇన్నింగ్స్ 80 పరుగులకే పరిమితమైంది.
జింబాబ్వే బౌలర్లలో కెప్టెన్ సికందర్ రజా 11 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. బ్రాడ్ ఇవాన్స్ మూడు, ముజరబ్బాని రెండు వికెట్లు తీసి తమవంతు పాత్ర పోషించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య టీమ్ జింబాబ్వే 14.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ (19), మరుమాని (17) పరుగులు చేశారు. రియాన్ బుర్ల్ 20 (నాటౌట్), ముసెకివా 21 (నాటౌట్) తమవంతు పాత్ర పోషించారు.