ఇకపై 100 శాతం సుంకాలకు నిర్ణయం
హాలీవుడ్ పూర్వవైభవం పేరిట చర్య
అమలు అయితే కలెక్షన్లకు గండి
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు భారతీయ సినిమాలు ఇతర విదేశీ చిత్రాలపై అత్యధిక సుంకాలతో విరుచుకుపడేందుకు సిద్ధం అయ్యారు.ఈ పరిణామం పట్ల భారతీయ చిత్ర ప్రముఖులు శేఖర్ కపూర్ సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో పలు భారతీయ చిత్రాలు, ప్రత్యేకించి దక్షణాదికి చెందిన సినిమాలు ఓవర్సీస్ మార్కెట్‌లో ప్రత్యేకించి అమెరికాలో అత్యున్నత సాంకేతిక విలువలు, ఇతర భావోద్వేగ అంశాలతో భారీ విజయాలు సాధించాయి. ఈ దశలో అమెరికాకు చెందిన హాలీవుడ్ రంగం దెబ్బతింటుందని భావిస్తోన్న ట్రంప్ అమెరికాకు దిగుమతి అయ్యే విదేశీ సినిమాలపై ఏకంగా 100 శాతం టారీఫ్ వేస్తామని,ఈ దిశలో ఆలోచిస్తున్నామని హెచ్చరించారు.
ఈ పరిణామంపై కపూర్ నిరసన వ్యక్తం చేశారు. ట్రంప్ ఆలోచనలతో చివరికి హాలీవుడ్ దెబ్బతింటుందని, భారతీయ సినిమాలకు వచ్చే నష్టం ఏదీ లేదని తెలిపారు. శనివారం ట్రంప్ మ ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫాంపై ఈ సుంకాల ప్రస్తావన తీసుకువచ్చారు. తమ దేశ వాణిజ్య శాఖకు ఈ సుంకాల విదింపులో పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇతర దేశాలలో నిర్మితం అయ్యి, అమెరికాలో విడుదల అయ్యి ఆడే విదేశీ సినిమాలై టారీఫ్ పెంపుదలకు ట్రంప్ రంగం సిద్ధం చేయడం ఆందోళనకరం అని శేఖర్ కపూర్ వ్యాఖ్యానించారు. మిస్టర్ ఇండియా, ఎలిజబత్ వంటి పలు సినిమాలను శేఖర్ కపూర్ నిర్మించారు. నిజానికి హాలీవుడ్ సినిమాకు బంపర్ కలెక్షన్లు అంటే దాదాఉగా 75 శాతం వరకూ అమెరికాకు వెలుపలే ఉంటాయని, ప్రత్యేకించి భారతీయ ప్రేక్షకులు ఆదరిస్తేనే హాలీవుడ్ సినిమా ఆడుతుందని తెలిపారు. మరో చిత్ర ప్రముఖుడు అనురాగ్ కశ్యప్ కూడా ట్రంప్ నిర్ణయంపై స్పందించారు. అయితే ఎక్కువగా వ్యాఖ్యానాలకు దిగలేదు.
అమెరికాలో మూవీ పరిశ్రమ త్వరితగతిన దెబ్బతింటోంది. ఇతర దేశాల సినిమాలు ఇక్కడ తమ పెత్తనం చలాయించేందుకు అన్ని విధాలుగా ముస్తాబు చేసుకుంటున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ పరిణామాన్ని అమెరికా ఫస్ట్ నినాదపు ఈ ట్రంప్ చూస్తూ ఉండలేరని తేల్చిచెప్పారు. అయితే టారిఫ్‌లు విధిస్తారా? వీటి ప్రభావం భారతీయ సినిమాపై ఏ విధంగా ఉంటుందనేది వెల్లడికావడం లేదు. అయితే ట్రంప్ అనుకున్నది చేసేస్తాడు కాబట్టి ఈ టారిప్ పెంపు భారతీయ సినిమా రంగానికి పిడుగు పాటు అవుతుందని బాలీవుడ్ దర్శకులు వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. 2023 తరువాత నుంచి వివిధ స్థాయిల్లో భారతీయ సినిమాలకు అమెరికాలో అత్యధిక రీతిలో కలెక్షన్లు వచ్చిపడుతున్నాయి.
ప్రత్యేకించి రాజమౌళి సినిమాలు బాహుబలి రెండు భాగాలు, ఆర్‌ఆర్‌ఆర్, ఆ తరువాతి పుష్ప రెండు భాగాల సినిమాలకు అమెరికాలో అత్యధిక కలెక్షన్లు దక్కాయి. పైగా అమెరికా మార్కెట్‌పై భారతీయ సినిమా నిర్మాతలు, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు.భారత్ కంటే ఒక్కరోజు ముందే అమెరికాలో ఇండియా సినిమాలు విడుదల అవుతాయి. అక్కడి మన యువతరం పెద్దగా హాలీవుడ్ సినిమాలు చూడకుండా, ఇండియాకు చెందిన సినిమాలు వస్తే ఎగబడి చూడటం జరుగుతోంది.ఇక్కడ సక్సెస్ రేటు భారతీయ సినిమాలకు గీటురాయి అవుతోంది.ఈ దశలో వంద శాతం సుంకాలు విధిస్తే వచ్చే కలెక్షన్ల లాభం అంతా ఆవిరి అవుతుందని భారతీయ చిత్ర ప్రముఖులు తెలిపారు.