Thursday, May 2, 2024

గాజా అష్ట దిగ్బంధం..

- Advertisement -
- Advertisement -

జెరూసలెం: గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దాడులను తీవ్రం చేసింది. శుక్రవారం రాత్రి సుమారు వంద యుద్ధ విమానాలతో గాజా ప్రాంతంపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. మరో వైపు హమాస్ స్థావరాలుగా అనుమానిస్తున్న ప్రాంతాలపై శతఘ్నిగుళ్ల వర్షం కురిపించింది. దీంతో కమ్యూనికేషన్ వ్యవస్థలన్నీ ధ్వంసం కావడంతో గాజా ప్రాంతానికి బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగి పోయాయి. దీంతో అక్కడ ఉంటున్న తమ వారి యోగక్షేమాల గురించి ఎలాంటి సమాచారం తెలియకపోవడంతో బయట ఉన్న వారంతా ఆందోళన చెందుతున్నారు. సుమారు వంద ఫైటర్ జెట్స్‌తో దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ గిలాడ్ కీనన్ తెలిపారు. గాజా ఉత్తరప్రాంతాన్ని జ్రాయెల్ దళాలు లక్షంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. గ్రౌండ్ ఆపరేషన్‌కు చెందిన ఊపును ఇజ్రాయెల్ ఆర్మీ క్రమేపీ పెంచుతున్నట్లు ఈ దాడులతో స్పష్టమవుతోంది.

శుక్రవారం రాత్రి దాదాపు నాలుగు గంటల పాటు వైమానిక దాడులు, పేలుళ్లతో గాజా నగరం దద్దరిల్లిపోయింది. ఈ దాడులతో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని పాలస్తీనాలో టెలికాం సేవలను అందించే పాల్‌టెల్ సంస్థ తెలిపింది. ఇంటర్‌నెట్, సెల్యులార్, ల్యాండ్‌లైన్ ఫోన్ సర్వీసులన్నీ పూర్తిగా ఆగిపోయాయి. కొన్ని శాటిలైట్ ఫోన్లు మాత్రం పని చేస్తున్నాయి. టెలిఫోన్ వ్యవస్థ కుప్పకూలిపోవడంతో మృతుల వివరాలు వెంటనే తెలుసుకోవడం కష్టమవడమే కాకుండా, ఆస్పత్రుల్లో వైద్య సేవలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల కారణంగా కొన్ని వారాలనుంచే చీకటిలో మగ్గుతున్న పాలస్తీనియను ఇప్పుడు టెలిఫోన్ సర్వీసులు కూడా లేకపోవడంతో బయటి ప్రపంచంతో సంబంధాలను పూర్తిగా కోల్పోయి ఆహారం, తాగు నీటి సరఫరాలు కూడా నిండుకు పోవడంతో ఇళ్లు, షెల్టర్లలోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ఏ క్షణంలో ఎటువైపునుంచి బాంబులు, రాకెట్లు వచ్చి పడతాయోనని భయంతో వణికిపోతున్నారు. కాగా శుక్రవారం రాత్రి అనేక ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దళాలకు, హమాస్ మిలిటెంట్లకు మధ్య వీధి పోరాటాలు కొనసాగాయని హమాస్ మీడియా సెంటర్ తెలియజేసింది.గాజా తూర్పు ప్రాంతంలోని బురీజ్ శరణార్థి శిబిరంపైన కూడా ఇజ్రాయెల్ దాడులు జరిపినట్లు ఆ మీడియా తెలిపింది. కాగా ఆపరేషన్ భవిష్యత్తు దశలకు గ్రౌండ్‌ను సిద్ధం చేసే లక్షంతో తాము దాడులు కొనసాగిస్తున్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ మరో సారి స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ దిగ్బంధించిన కారణంగా బయటినుంచి సరఫరాలు పూర్తిగా నిలిచిపోవడంతో గాజావాసులు ఆకలిదప్పులతో అలమటించాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇజ్రాయెల్ తమ చేతులను కట్టేసిందని ఐక్యరాజ్యసమితి మానవతా సహాయం విభాగం అంటోంది.

ఆ ఆస్పత్రి హమాస్ హెడ్‌క్వార్టర్స్: ఇజ్రాయెల్
గాజాలోనే అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్ షిపా కేవలం ఆస్పత్రి మాత్రమే కాదని, హమాస్ మిలిటెంట్ల ప్రధాన కార్యాలయం కూడానని ఇజ్రాయెల్ ఆరోపించింది. దీనికి సంబంధించి నిఘా వర్గాల ఆధారిత ఓ యానిమేటెడ్ వీడియోను ‘ఎక్స్’ వేదికగా ఇజ్రాయెల్ విడుదల చేసింది.ఆస్పత్రి భవనం కింది భాగంలో ఓ నివాసం ఉన్నట్లు వీడియోలో చూపించింది.గాజాలోని రహస్య ఉగ్రవాద స్థావరాలను బట్టబయలు చేస్తామని ఐడిఎఫ్ హెచ్చరించింది.ఇదిలా ఉండగా ఇంధనం, ఆహారం, విద్యుత్ కొరతతో అల్‌షిఫా ఆస్పత్రిలో పరిస్థితులు దయనీయంగా మారాయి. వైమానిక దాడులనుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి పౌరులు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో ఆస్పత్రి కిక్కిరిసి పోయింది. ఇక్కడి ఇంక్యుబరేటర్లలోని శిశువుల విషయంలో ఎన్‌ఐసియు వైద్యలు ఆందోళన చెందుతున్నారు. వెంటనే అవసరమైన వైద్య సామగ్రిని పంపించాలని, లేని పక్షంలో తీవ్ర విపత్తు ఎదురవుతుందని ఆస్పత్రి వైద్యుడు నాసర్ బుల్బుల్ అన్నారు.

హమాస్ వైమానిక దళ అధిపతి హతం
కాగా శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ వైమానిక దళ అధిపతి ఇస్సామ్ అబూ రుక్బే హతమైనాడు. శుక్రవారం రాతత్రి జరిగిన దాడిలో అతను మరణించినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. ఇజ్రాయెల్ రక్షణ దళాలు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. హమాస్ మిలిటెంట్ గ్రూపునకు చెందిన డ్రోన్లు, ఏరియల్ వెహికిల్స్, పారా గ్లైడర్లు, ఏరియల్ డిటెక్షన్ సిస్టమ్స్‌ను అబూ రుక్బే మేనేజ్ చేసే వాడని ఇజ్రాయెల్ మిలిటరీ పేర్కొంది. అక్టోబర్ 7 ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన భీకర రాకెట్ దాడిలో అబూ రుక్బే కీలక పాత్ర పోషించినట్లు ఐడిఎఫ్ వెల్లడించింది. రుక్బే ఆదేశాల ప్రకారమే హమాస్ పారాగ్లైడర్లు ఇజ్రాయెల్ దక్షిణభూభాగంలోకి వచ్చినట్లు ఐడిఎఫ్ పేర్కొంది.తమ రక్షణ దళాల పోస్టులపై డ్రోన్లతో దాడి చేసింది కూడా రుక్బే వల్లనేనని ఇజ్రాయెల తెలిపింది. ఈ నెల 14న జరిగిన దాడిలో హమాస్ ఏరియల్ ఫోర్సెస్‌కు చెందిన మాజీ చీఫ్ మురాద్ అబూ మురాద్ హతమైనట్లు గతంలో ఐడిఎఫ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

దాడులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం: హమాస్
కాగా ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కోవడానికి గాజాలోని తమ బలగాలు పూర్తి సిద్ధంగా ఉన్నాయని హమాస్ ప్రకటించింది. గాజాపై దాడులను తీవ్రం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించిన తర్వాత సరిహద్దు సమీప ప్రాంతాల్లో తమ బలగాలు ఇజ్రాయెల్‌తో పోరు జరుపుతున్నాయని హమాస్ అంతకు ముందు ప్రకటించింది. గాజా వాయువ్య ప్రాతంలోని బీట్ హనౌన్, మధ్య ప్రాంతమైన అల్‌బురైజ్‌లో ఇజ్రాయెల్ దళాలతో తమ యోధులు పోరాడుతున్నారని శుక్రవారం రాత్రి పొద్దుపోయాక హమాస్ సాయుధ విభాగం ప్రకటించింది. ‘అల్ అక్సమ్ బ్రిగేడ్లు, పాలస్తీనా రెసిస్టెన్స్ దళాలు అన్నీ కూడా ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కోవడానికి, దాని చొరబాట్లను తిప్పి కొట్టడానికి పూర్తి సిద్ధంగా ఉన్నాయి’ అని హమాస్ శనివారం ఉదయం ఒక ప్రకటనలో తెలియజేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News