Saturday, August 16, 2025

చెంచులకు 10 వేల ఇళ్లు

- Advertisement -
- Advertisement -

 గూడులేని ఆదిమ, గిరిజన తెగలకు ఇందిరమ్మ ఆవాసాలు ఐటిడిఎ పరిధిలోని ఎస్‌టి నియోజకవర్గాలకు
అదనంగా 500 నుంచి 700 ఇళ్లు గవర్నర్, సిఎం ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం దశాబ్దాలుగా
ఏ ప్రభుత్వం చెంచుల కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు: గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి

మనతెలంగాణ/హైదరాబాద్: తరతరాలుగా సొంత ఇళ్లకు నోచుకోని ఆదిమ, గిరిజన తెగలకు చెందిన అతి బలహీన వర్గమైన చెంచులకు సొంతింటి కలను కల్పించాలని ప్రభుత్వం సంకల్పించిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం సాకారం చేయబోతోందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ఉట్నూరు, భద్రాచలం, మున్ననూర్, ఏటూరు నాగారం నాలుగు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటిడిఎ)ల పరిధిలో సచ్యురేషన్ పద్దతిలో దాదాపు పదివేల చెంచు కుటుంబాలను గుర్తించడం జరిగిందని వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మంగళవారం సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో శాశ్వత గృహాలను నిర్మించా లని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో సూచించారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే వారిద్దరి సూచనల మేరకు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి, వారి నివాస గృహాల నిర్మాణంపై అనేక సూచనలు చేశారని అందులో భాగంగానే గిరిజన ప్రాంతాల్లో చెంచులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు.

చెంచులకు ఆసిఫాబాద్‌లో 3,551 ఇళ్లు

అడవులను నమ్ముకొని జీవించే గిరిజనుల్లో చెంచులు ఒక జాతి అని. వారు అడవుల్లో వేటాడటం, అటవీ ఫలసాయం సేకరించి అమ్ముకొని జీవనం సాగిస్తున్నారని ఆయన తెలిపారు. చిన్నచిన్న గుడిసెలు తప్ప వీరికి పక్కా ఇల్లు ఎలా ఉంటుందో తెలియని ఆయన వాపోయారు. అలా అని ఆ అడవి ప్రాంతాల్ని వదలి వారు బ్రతక లేరని ఆయన తెలిపారు. అందుకే వారు జీవించే ప్రదేశంలోనే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన కూడా చేయలేదన్నారు. ఉట్నూరు ఐటిడిఎ పరిధిలో ఆసిఫాబాద్‌లో 3,551 ఇళ్లు, బోథ్‌లో 695 ఇళ్లు, ఖానాపూర్‌లో 1,802 ఇళ్లు, సిర్పూర్ 311 ఇళ్లు, అదిలాబాద్‌లో 1,430 ఇళ్లు, బెల్లంపల్లిలో 326 ఇళ్లు, భద్రాచలం ఐటిడిఎ పరిధిలో అశ్వరావుపేటలో 105 ఇళ్లు, మున్ననూర్ చెంచు స్పెషల్ ప్రాజెక్ట్‌లో భాగంగా అచ్చంపేట్ 518 ఇళ్లు, మహబూబ్‌నగర్ 153 ఇళ్లు, పరిగిలో 138 ఇళ్లు, తాండూర్‌లో 184 ఇళ్లు మొత్తంగా 9,395 ఇళ్లను మంజూరు చేస్తున్నామని మంత్రి పొంగులేటి ప్రకటించారు.

20 శాతం ఇళ్లు బఫర్ కింద

ఈ ఏడాది రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని, అయితే ఐటిడిఎ పరిధిలోని గిరిజన నియోజకవర్గాలకు అదనంగా 500 నుంచి 700 ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చిందని, అయితే ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లకు గాను 20 శాతం ఇళ్లను బఫర్ కింద పెట్టుకోవడం జరుగుతుందన్నారు. పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా జిహెచ్‌ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. పట్టణంలోని ముఖ్య ప్రాంతాల్లోని మురికి వాడల్లో జీవనం కొనసాగిస్తున్న పేదలు అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారని , హైదరా బాద్‌కు దూరంగా ఇళ్లు నిర్మించి ఇస్తే తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. గత ప్రభుత్వం కొల్లూరులో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి హైదరాబాద్‌లో ఉన్నపేదలకు కేటాయిస్తే వాటిని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదన్నారు. వాటిని దృష్టిలో పెట్టకొని పేదలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్న ప్రాంతంలోనే జీ ప్లస్ త్రీ పద్ధతిలో అపార్ట్‌మెంట్‌లు నిర్మించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News