Friday, July 18, 2025

కేరళ పాఠశాలలో విద్యుదాఘాతానికి 13 ఏళ్ల పిల్లాడు మృతి

- Advertisement -
- Advertisement -

కొల్లం జిల్లాలోని పాఠశాలలో ఓ 13 ఏళ్ల పిల్లాడు గరువారం విద్యుదాఘాతానికి గురై మరణించాడు. దీనిపై వివిధ రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని, నిరసనను తెలిపాయి. బాధితుడిని ఇక్కడి థేవలక్కరలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న మిథున్‌గా గుర్తించారు. స్కూల్ భవనం పక్కనే ఉన్న సైకిల్ షెడ్‌పై అతడి స్లిప్పర్(పాదరక్ష) జారిపడింది. దానిని తిరిగి తీసుకునే క్రమంలో ఉదయం 9.15 గంటలకు విద్యుదాఘాతానికి గురయ్యాడని పోలీసులు తెలిపారు. అక్కడే వేలాడుతున్న విద్యుత్ తీగ తగిలి అతడు మృత్యుబారిన పడినట్లు సమాచారం. అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కె.ఎన్.బాలగోపాల్, విద్యా మంత్రి వి.శివన్ కుట్టి మెడికల్ కాలేజ్‌కి చేరుకుని మరణించిన విద్యార్థికి నివాళులు అర్పించారు.

మృతుడి తల్లి కువైట్‌లో పనిచేస్తోంది. ఆమెకు ఇంకా విషయం తెలుపలేదు. ఆమె వచ్చాకే అంత్యక్రియలు జరుగనున్నాయి. అప్పటి వరకు మృత దేహాన్ని సస్థంకొట్ట తాలూకా ఆసుపత్రి మార్చురిలో భద్రపరిచి ఉంచనున్నారు. పిల్లాడి తండ్రి ఉదయమే ఆ విద్యార్థిని పాఠశాలకు తీసుకొచ్చి వదిలిపోయాడు. కాగా రాష్ట్ర మానవ హక్కుల సంఘం తనంత తానుగా ముందుకొచ్చి కేసును నమోదుచేసింది. ఇదిలావుండగా కేరళ రాష్ట్ర విద్యుత్తు బోర్డు(కెఎస్‌ఈబి), పాఠశాల నిర్వాహకులు నిర్లక్షంగా వ్యవహరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్, బిజెపి సహా కేరళలోని అనేక ప్రతిపక్షపార్టీలు మిథున్ మరణంపై నిరసనలు వ్యక్తం చేశాయి. ఇదిలావుండగా రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి కె. కృష్ణన్ కుట్టి ఘటనపై కెఎస్‌ఈబి అధికారుల నుంచి నివేదికను కోరారని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News