భీమవరం టాకీస్ (Bhimavaram Talkies)పతాకంపై ఇప్పటికే 114 చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ… ప్రపంచ సినిమా చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఒకేసారి 15 చిత్రాలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో కిక్కిరిసిన సినీ అభిమానుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అతిరధమహారధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మురళీమోహన్, రేలంగి నరసింహారావు, సుమన్, శ్రీకాంత్, జె.డి.చక్రవర్తి, తనికెళ్ళ భరణి, 30 ఇయర్స్ పృథ్వి, అజయ్ ఘోష్, సి.కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, తుమ్మల ప్రసన్నకుమార్, చదలవాడ శ్రీనివాసరావు, భరత్ భూషణ్, వల్లూరిపల్లి రమేష్ బాబు, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యులు విజయేంద్రప్రసాద్, కె.ఎల్.స్టూడియో అధినేత కొంతం లక్ష్మణ్, గజల్ శ్రీనివాస్, చీకటి ప్రవీణ్, ఇమ్మడి రమేష్, వంశీ రామరాజు, కె.ధర్మారావు, గిడుగు కాంతి కృష్ణ తదితర దిగ్గజాలు హాజరై రామసత్యనారాయణను అభినందించారు.
15 చిత్రాలకు 15 కెమెరాలతో క్లాప్, స్విచ్ఛాన్, గౌరవ దర్శకత్వం చేయించడం విశేషం. ఆగస్టు 15న కొబ్బరికాయలు కొట్టిన ఈ 15 చిత్రాలకు 2026 ఆగస్టు 15కి పూర్తి చేసి గుమ్మడికాయలు కొట్టేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నామని రామసత్యనారాయణ పేర్కొన్నారు. ఈ 15 చిత్రాలకు కెఎల్ స్టూడియోను 25 శాతం డిస్కౌంట్ తో ఇస్తున్నందుకు కొంతంకు కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా పేరొందిన 9 సంస్థలు ఈ ప్రారంభోత్సవాన్ని వరల్డ్ రికార్డ్ బుక్స్ లో నమోదు చేశాయి.