Tuesday, December 10, 2024

క్వెట్టా రైల్వే స్టేషన్‌లో ఆత్మాహుతి బాంబు దాడి..24 మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్‌లోని కల్లోలిత బలోచిస్తాన్ రాష్ట్రంలో ఒక రైల్వే స్టేషన్‌లో శనివారం ఆత్మాహుతి బాంబు దాడిలో కనీసం 24 మంది వ్యక్తులు దుర్మరణం చెందగా, మరి 46 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర రాజధాని క్వెట్టా రైల్వే స్టేషన్‌లో శనివారం ఉదయం 9 గంటలకు జాఫర్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరడానికి ముందు ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులు సమీకృతం కాగా విస్ఫోటం స్టేషన్‌లో విధ్వంసం సృష్టించింది. అది ఆత్మాహుతి బాంబు దాడి అని, పేలుడులో 24 మంది హతమయ్యారని క్వెట్టా డివిజనల్ కమిషనర్ హంజా షఫ్‌కాత్ తెలియజేశారు. ఆత్మాహుతి బాంబర్ లగేజితో స్టేషన్‌లోకి ప్రవేశించాడని కమిషనర్ తెలిపారు.

ఆత్మాహుతి దాడి జరిపే ఉద్దేశంతో వస్తున్న వ్యక్తిని నిలిపివేయడం కష్టమని ఆయన అన్నారు. ఉగ్ర సంస్థగా ముద్ర పడిన బలోచ్ వేర్పాటువాద వర్గం బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్‌ఎ) ఈ దాడికి తనదే బాధ్యత అని పేర్కొన్నది. ఫెడరల్ ప్రభుత్వం రాష్ట్రం అభివృద్ధిని అలక్షం చేస్తూ బలోచిస్తాన్ వనరులను దోపిడీ చేస్తోందని బిఎల్‌ఎ ఆరోపిస్తోంది. అయితే, ఆ ఆరోపణలను ఫెడరల్ ప్రభుత్వం ఖండించింది. విధ్వంసకాండ సాగించేందుకు అసంతుష్ట శక్తులను విదేశీ శక్తులు దుర్వినియోగం చేస్తున్నాయని ప్రభుత్వం పేర్కొన్నది. బలోచిస్తాన్ మస్తుంగ్ జిల్లాలో ఒక బాలికల పాఠశాల, ఒక ఆసుపత్రి సమీపాన విస్ఫోటం జరిగిన వారం తరువాత ఆత్మాహుతి బాంబు దాడి చోటు చేసుకున్నది. మస్తుంగ్ జిల్లా ఘటనలో ఐదుగురు పిల్లలతో సహా ఎనిమిది మంది వ్యక్తులు మరణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News