Friday, March 1, 2024

భారీ యంత్రాలు విఫలమైన వేళ..

- Advertisement -
- Advertisement -

41 మంది కార్మికులను కాపాడిన ర్యాట్‌హోల్ మైనింగ్

ఉత్తర కాశీ: ఉత్తర కాశీలోని సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించడానికి గత 17రోజులుగా అధికార యంత్రాంగం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అమెరికానుంచి దిగుమతి చేసుకున్న ఆగర్ మిషిన్‌లాంటి హైటెక్ యంత్రాలతో సొరంగంలో డ్రిల్లింగ్ చేసి కార్మికులు ఉన్న చోటు వరకు పైపులను చొప్పించి వాటి ద్వారా కార్మికులను బయటికి తీసుకు రావాలని ప్రయత్నించారు. అంతా సజావుగా సాగిపోతోందని, మరి కొద్ది గంటల్లో కార్మికులను బయటికి తీసుకు రావచ్చని రెస్కూ అధికారులు భావిస్తున్న తరుణంలో కేవలం 12 మీటర్ల డ్రిల్లింగ్ మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ఆగర్ మిషిన్‌కు ఇనుప వస్తువు అడ్డుపడడంతో దాని బ్లేడ్ల్లన్నీ ధ్వంసమయ్యాయి.

దీంతో సమాంతర డ్రిల్లింగ్ ప్రయత్నం మానుకుని సొరంగంపైనుంచి డ్రిల్లింగ్ జరపాలని భావించారు. ఓ వైపు ఆ ప్రయత్నాలు కొనసాగుతూ ఉండడగానే ఆగిపోయిన చోటునుంచి మిగిలి ఉన్న 12 మీటర్లను ర్యాట్ హోల్ డ్రిల్లింగ్ చేపట్టి విజయవంతంగా కార్మికులుండే చోటుకు చేరుకున్నారు. భారీ ప్రయత్నాలన్నీ విషలమైన తరుణంలో బొగ్గుగనుల్లో బొగ్గు తవ్వకం కోసం ఉపయోగించే ఈ ర్యాట్ హోల్ పద్ధతి ఎలా విజయవంత మయిందని ఇప్పుడు అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఈ ర్యాట్‌హోల్ మైనింగ్ అంటే ఏమిటి? అది ఎలా చేపడతారో తెలుసుకుందాం.

ర్యాట్‌హోల్ మైనింగ్ అనేది భూగర్భ గనుల్లో బొగ్గును బయటికి తీసేందుకు ఉపయోగించే విధానం. ఈ విధానంలో చాలా చిన్నగా అంటే కేవలం 4 అడుగుల వెడల్పుకన్నా తక్కువ ఉండే గోతులను తవ్వడం ద్వారా బొగ్గును బయటికి తీసుకు వస్తారు. బొగ్గు గనుల్లో సన్నని మార్గాలను తవ్వడంలో నిపుణులైన కార్మికులను ర్యాట్ మైనర్స్‌గా పిలుస్తారు. వీరు ముందుగా గనిలోకి ప్రవేశించాక చేతితో ఉపయోగించే పరికరాల ద్వారా సొరంగాన్ని తవ్వుతారు. బొగ్గు పొరను చేరుకున్న తర్వాత అక్కడ తవ్వకాలు యొదలు పెడతారు. ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో బొగ్గును బయటికి తీయడానికి ఈ విధానాన్ని ఎక్కువగా వాడుతుంటారు.

అక్కడ బొగ్గు పొర చాలా పలచగా ఉంటుంది. అక్రమ బొగ్గు తవ్వకాలు కూడా అక్కడ ఎక్కువే. అలాంటి వాటి లో వేరే విధానాలు ఆర్థికంగా గిట్టుబాటు కావు గను ఈ ర్యాట్‌హోల్ మైనింగ్ ద్వారా బొగ్గును బైటికి తీస్తుంటారు. చిన్న సైజు టన్నెల్స్ కావడంతో చాలావరకు చిన్న పిల్లలనే ఎక్కువగా దీనికోసం ఉపయోగిస్తుంటారు కూడా. అక్కడ జీవనోపాధి మార్గాలు తక్కువ కావడంతో పిల్లలే పెద్దవాళ్లమని చెప్పుకుని పనిలో చేరిపోతుంటారు కూడా. ఒకరు సొరంగం తవ్వుతూ ఉంటే, మరొకరు తవ్విన బొగ్గును ఎత్తిపోస్తూ ఉంటారు. మరోవ్యక్తి దాన్ని ట్రాలీలోకి చేరి బయటికి పంపిస్తారు. అయితే ఈ పద్ధతి అశాస్త్రీయమైనది, ప్రమాదకరమైనదంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్‌జిటి)2014లో ఈ పద్ధతిని నిషేధించినప్పటికీ ఇప్పటికీ ఆ రాష్ట్రంలో ఇదే పద్ధతిలో ఎక్కువగా బొగ్గు తవ్వకాలు జరుగుతుండడం గమనార్హం.

అంతేకాకుండా చాలా ప్రమాదాలు జరగడం, పలువురు కార్మికులు చనిపోవడం కూడా జరిగింది. 2018లో 15 మంది అక్రమ మైనింగ్ జరుపుతుండగా వరదనీరు గనిని ముంచెత్తడంతో వారంతా గనిలో చిక్కుకు పోయారు. దాదాపు రెండు నెలల పాటు రెస్కూ ఆపరేషన్ కొనసాగిన తర్వాత రెండు మృతదేహాలను మాత్రమే కనుగొన్నారు. 2021లో కూడా ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. అయిదుగురు కార్మికులు వరద నీటితో నిండిపోయిన గనిలో చిక్కుకు పోయారు.

దాదాపు నెలల రోజుల పాటు వారిని రక్షించడానికి ప్రయత్నించాక అందరూ చనిపోయి ఉంటారని భావించి ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. మూడు మృతదేహాలు మాత్రమే లభించాయి. అయితే రాష్ట్రప్రభుత్వానికి మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టే దీన్ని ఎన్‌జిటి నిషేధించడాన్ని మేఘాలయ ప్రభుత్వం న్యాయస్థానంలో సవాలు చేసింది కూడా. నిషేధం తర్వాత కూడా ఈ ర్యాట్‌హోల్ మైనింగ్ పద్ధతి నిరాఘాటంగా కొనసాగుతున్నట్లు హైకోర్టు నియమించిన కమిటీ 2022లో సమర్పించిన నివేదికలో పేర్కొంది .

కాగా ఉత్తరకాశీ టన్నెల్‌లో ఈ ర్యాట్‌హోల్ మైనింగ్ జరపడం కోసం మొత్తం 12 మంది నిపుణులను ఢిల్లీనుంచి విమానంలో తీసుకువచ్చినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం నోడల్ అధికారి నీరజ్ ఖైరావాల్ చెప్నారు. వాస్తవానికి వీరు ర్యాట్‌హోల్ మైనర్స్ కాదని, ఆ టెక్నిక్‌లో నిష్ణాతులైన నిపుణులని ఆయన చెప్పారు. ఇప్పటకే టన్నెల్‌లో అమర్చిన 800 ఎంఎం పైప్‌లోపల పడి ఉన్న బండరాళ్లు లాంటి వాటిని వీరు పార, పలుగు లాంటి చేతులతో ఉపయోగించే సాధనాలను తొలగించారు.

ఆక్సిజన్ కోసం తమతో పాటు ఒక బ్లోవర్‌ను కూడా తీసుకెళ్తామని ఈ కార్యక్రమంలో నిమగ్నం కావడానికి ముందు బృందం సభ్యుడొకరు చెప్పారు. ఇది చాలా రిస్క్‌తో కూడుకున్న పని అయినప్పటికీ ఈ బృందం సభ్యులంతా ఇందులో నిష్ణాతులు కావడంతో తక్కువ రిస్క్‌తోనే పని పూర్తి చేశారు. పెద్దపెద్ద ఆధునిక యంత్రాలు చేయలేని పనిని ర్యాట్‌హోల్ మైనింగ్ ద్వారా పూర్తి చేసి 41 మంది కార్మికులను కాపాడినందుకు ఈ నిపుణులను అభినందించి తీరాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News