Sunday, May 26, 2024

అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో 49 మందిపై నేర నిర్ధారణ

- Advertisement -
- Advertisement -

49 convicted in Ahmedabad serial blasts case

అహ్మదాబాద్ : అహ్మదాబాద్‌లో వరుస పేలుళ్ల కేసులో 49 మందిని నేరస్థులుగా ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ప్రకటించింది. 2008 జులై 26లో అహ్మదాబాద్ నగరంలో ఒకేసారి 70 నిమిషాల వ్యవధిలో వరుసగా జరిగిన 21 పేలుళ్లలో 56 మంది చనిపోగా, 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో మరో 28 మంది నిర్దోషులుగా ప్రత్యేక కోర్టు జడ్జి ఎఆర్ పటేల్ విడిచిపెట్టారు. ఈ పేలుళ్లకు సంబంధించి మొత్తం వేర్వేరుగా దాఖలైన 35 కేసులను కలిపి ఒకటిగా విచారించారు. మొత్తం 77 మంది నిందితులపై విచారణ జరిగింది. నేరస్థులు 49 మందికి శిక్షలు ఖరారు చేయడం బుధవారం నుంచి ప్రారంభమౌతుందని కోర్టు వెల్లడించింది. నిందితులు 77 మందిపై విచారణ గత ఏడాది సెప్టెంబర్ 21నే పూర్తయింది. కానీ తరువాత తీర్పు తేదీలు అనేక మార్లు వాయిదా పడ్డాయి.

విచారణ సందర్భంగా మొత్తం 1163 మంది సాక్షులను విచారించారు. నిర్దోషులుగా విడుదలైన వారిలో మొహమ్మద్ ఇర్ఫాన్ నసీర్ అహ్మద్, షకీల్ అహ్మద్ ఉన్నారు. నిందితులు వివిధ జైళ్ల నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. తీర్పు కూడా వారు వర్చువల్‌గా హాజరై విన్నారు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) అనే నిషేధిత ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న 78 మందిపై 2009 డిసెంబర్‌లో విచారణ ప్రారంభమైంది. వీరిలో ఒకరు అప్రూవర్‌గా మారడంతో నిందితుల సంఖ్య 77 కు తగ్గింది. తరువాత మరో నలుగురు నిందితులు అరెస్టయినా వారిపై విచారణ ఇంకా ప్రారంభం కాలేదని సీనియర్ ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. 2002లో జరిగిన గోద్రా అల్లర్లకు ప్రతీకారంగా ఐఎం ఉగ్రవాదులు ఈ పేలుళ్లకు కుట్ర పన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పేలుళ్లు జరిగిన ప్రదేశాల్లో అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలోని ట్రామా కేర్ సెంటర్ కూడా ఉంది. ఈ సంఘటనలో మైనార్టీ సమాజానికి చెందిన అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వరుస పేలుళ్ల తరువాత సూరత్‌లో అనేక ప్రాంతాల నుంచి పోలీసులు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. అహ్మదాబాద్‌లో 20, సూరత్‌లో 15 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News