Friday, May 24, 2024

నాలుగో విడతలో 63% పోలింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సోమవారం జరిగిన లోక్‌సభ నాలుగో విడత ఎన్నికలలో మొత్తం మీద 62.9 శాతం పోలింగ్ నమోదైంది. తొమ్మిది రాష్ట్రాలు, ఒక్క కేంద్రపాలిత ప్రాంతంలో ఈ దఫా 96 స్థానాలకు పోలింగ్ జరిగింది. 1717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో ఒకే విడతలో అసెంబ్లీ , లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఈ దఫా ఎన్నికలతో ఇక దక్షిణ భారతదేశంలో పోలింగ్ ప్రక్రియ పూర్తి అయింది.పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 76 శాతం, తరువాతి క్రమంలో మధ్యప్రదేశ్‌లో దాదాపు 69 శాతం, జార్ఖండ్‌లో 64 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 58 శాతం, బీహార్‌లో 56 శాతం వరకూ ఓట్లు పోలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణలో 17, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 8, మహారాష్ట్రలో 11, ఒడిశాలో 4, ఉత్తరప్రదేశ్‌లో 13, పశ్చిమబెంగాల్‌లో 8, జమ్మూ కశ్మీర్‌లో శ్రీనగర్ ఒక్కస్థానానికి నేడు పోలింగ్ జరిగిందని ఎన్నికల సంఘం తెలిపింది. నిర్థారితంగా ఉండే సాయంత్రం ఆరుగంటలకు ముగిసే పోలింగ్ సమయానికి దాదాపుగా 63 శాతం మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.

అయితే క్యూ లైన్లలో ఉండే వారందరికీ ఓటింగ్ అవకాశం ఇవ్వడంతో, కొన్ని ప్రాంతాలలో రాత్రి పదిగంటల వరకూ కూడా ఓటర్లు నిలిచి ఉండటంతో ఓటింగ్ శాతం దాటిపోతుందని భావిస్తున్నారు. ఈ నాలుగవ దఫా పోలింగ్‌లో మొత్తం 96 స్థానాలు ఉండగా, వీటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపితే 42 స్థానాల వరకూ అంటే 44 శాతం వరకూ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయని గణాంకాలతో వెల్లడైంది. ఈ దఫా ఎన్నికలలో బిజెపి, కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందిన సీనియర్ నేతలు కూడా బరిలో ఉన్నారు. కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, అజయ్ మిశ్రా , శత్రఘ్ను సిన్హా, అసదుద్దిన్ ఒవైసీ ఇతర నేతలు కూడా ఉన్నారు. టిఎంసి ప్రముఖ నేతలు కూడా బరిలో ఉండటంతో ఈసారి పోలింగ్‌కు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఎస్‌పి నేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి, ఒమర్ అబ్దుల్లా వంటి ప్రముఖులు కూడా తమ బలం పరీక్షించుకుంటున్నారు. దేశంలో తదుపరి ఐదో విడత పోలింగ్ ఈ నెల 20వ తేదీన జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News